40 వసంతాల తెలుగుదేశం పార్టీ.. ఆవిర్భావ వేడుకలకు భారీగా ఏర్పాట్లు, లోగో ఇదే

Siva Kodati |  
Published : Mar 25, 2022, 10:09 PM IST
40 వసంతాల తెలుగుదేశం పార్టీ.. ఆవిర్భావ వేడుకలకు భారీగా ఏర్పాట్లు, లోగో ఇదే

సారాంశం

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. మంగళగిరిలోని టీడీపీ  కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వివరాలు వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు (tdp 40 years celebrations) పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.  టీడీపీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ నాడు వాడవాడల్లో పలు కార్యక్రమాలు జరిపేందుకు పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆవిష్కరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 

రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు తెలుగుదేశం పాలనలో అందాయని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బిసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే అని, అనేక సామాజిక మార్పులకు టిడిపి ఆవిర్భావం కారణమైందని చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే అని, జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు. 

టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ రోజున గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు ఉండాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని క్యాడర్‌ను ఆయన ఆదేశించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ప్రాంతాన్ని సందర్శిస్తామన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. 

అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారని చంద్రబాబు చెప్పారు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలపై చంద్రబాబు స్పందించారు. కల్తీ మద్యం వల్ల అంతమంది చనిపోతే కనీసం చర్చ ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ (ys jagan) కనుసన్నల్లోనే సరఫరా అవుతుందని ఆయన ఆరోపించారు. కొన్ని బ్రాండ్ల మద్యం ఏపీలో కన్పించకుండా పోవడడానికి కారణాలు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. కిళ్లీ కొట్టులో కూడా ఆన్‌లైన్ పేమెంట్లు ఉంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్ పేమెంట్లు ఎందుకు ఉండవని ఆయన నిలదీశారు. 

మద్యం విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్లేది లేదన్న ఆయన.. కల్తీ సారా వల్ల 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా అంటూ మండిపడ్డారు. మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారని... దీనిపై ప్రజల్లోకి వెళ్తాం అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 15,600 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని, ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. 

జగన్ చేసిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టు (polvaram project) సర్వనాశనం అయ్యిందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులిస్తామని నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. పోలవరం విషయంలో సీఎం జగన్ నంగి నంగి మాట్లాడుతున్నారని, వాస్తవాలు చెప్పాలని చంద్రబాబు విమర్శించారు. మిగిలిపోయిన కాఫర్ డ్యాం పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేదే కాదని అభిప్రాయపడ్డారు. తప్పులన్నీ జగన్ చేసి ఇప్పుడు టిడిపిపై తోస్తున్నారని మండిపడ్డారు. పోలవరం- అమరావతి ఏపీకి రెండు కళ్లు అయితే ఆ రెండు కళ్లను సీఎం జగన్ పొడిచేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu