వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోంది.. మంత్రి పెద్దిరెడ్డి పనైపోయింది: చంద్రబాబు నాయుడు

By Sumanth KanukulaFirst Published Jan 16, 2023, 5:23 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నీచ రాజకీయాలపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నీచ రాజకీయాలపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతున్నారని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లాకు వచ్చి.. పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న టీడీపీ నేతలను కూడా కలవకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. 

టీడీపీ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. చల్లా బాబు జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ గూండాలు చింపివేయడమే కాకుండా.. తిరిగి రెచ్చగొడుతూ దాడులకు దిగారని ఆరోపించారు. పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తూ మైనారిటీల మీద హత్యాయత్నం కేసులు పెట్టి లాకప్ లో తీవ్రంగా కొట్టి వేధించారని అన్నారు. పోలీసులకు ఆ హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 

అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా?, బూతులు తిడుతూ, అనుచితంగా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తుందని.. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమని అన్నారు. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. టీడీపీ శ్రేణుల పట్ల కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. అలాంటివారిని విడిచిపెట్టబోమన్నారు. ఎంతమందిని జైలులో పెడతారో తాము చూస్తామని.. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని చెప్పారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ క్యాడర్‌ను జైలులో పెట్టారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. పండగ పూట తన కార్యకర్తల కోసం జైలుకు వచ్చాననని చెప్పారు. పెద్దిరెడ్డి పని అయిపోయిందని.. ఆయన పార్టీ పోతుందని విమర్శించారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలని అన్నారు. వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

click me!