Chandrababu Naidu: 4 గంటల్లో 40 కిలోమీటర్లే ముందుకు సాగిన చంద్రబాబు కాన్వాయ్..

By Mahesh RajamoniFirst Published Nov 1, 2023, 4:34 AM IST
Highlights

Rajamahendravaram: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం ఆయ‌న జైలు నుంచి బ‌య‌టకు వ‌చ్చారు. చంద్ర‌బాబు విడుద‌ల  సందర్భంగా జైలు వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వచ్చారు. ఆయ‌న వెళ్తే మార్గంలోనూ మ‌ద్ద‌తు తెలిపారు. 
 

Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం ఆయ‌న జైలు నుంచి బ‌య‌టకు వ‌చ్చారు. చంద్ర‌బాబు విడుద‌ల  సందర్భంగా జైలు వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వచ్చారు. ఆయ‌న వెళ్తే మార్గంలోనూ మ‌ద్ద‌తు తెలిపారు. రాజమండ్రి నుంచి విజయవాడకు బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ 40 కిలోమీటర్ల దూరంలోని పెరవలి చేరుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది.

రాజమండ్రిలోని లాలాచెరువు, వేమగిరి వద్ద జాతీయ రహదారిపైకి వేలాది మంది కార్యకర్తలు చేరుకుని త‌మ మ‌ద్ద‌తును తెలిపారు. పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా చంద్రబాబు నాయుడుకు టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు  అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. కాన్వాయ్ వెనుక 3 కిలోమీటర్ల దూరంలో కూడా పార్టీ శ్రేణుల వాహనాలు వారిని వెంబడించడంతో పోలీసులు వారిని అంచెలంచెలుగా అడ్డుకున్నారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేయడంతో పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాన్వాయ్ ను పలుచోట్ల అడ్డుకున్నారు. జొన్నాడ సెంటర్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మంది తరలివచ్చారు. రావులపాలెంలో రోడ్లకు ఇరువైపులా వేలాది మంది అభిమానులు వేచి ఉన్నారు.

కోనసీమ నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు రోడ్లపై బారులు తీరారు. రావులపాలెంలో టీడీపీ నేతలు గంటి హరీశ్ మాధుర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, అనంతకుమారి, బండారు సత్యానందరావు, అయితబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, గొల్లపల్లి సూర్యారావు, మెట్ల రమణబాబు, డొక్కా నాథ్ బాబు, బొల్లా వెంకటరమణ తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్ర‌బాబు నాయుడు కాన్వాయ్ రావులపాలెం మీదుగా సిద్ధాంత సెంటర్ కు చేరుకుంది. ఆచంట, నరసాపురం నియోజకవర్గాల కార్యకర్తలు, అభిమానులు అక్కడకు కూడా చేరుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, నరసాపురం ఇన్చార్జి పొత్తూరి రామరాజు, ఆచంట పరిశీలకులు బొల్లా సతీష్ బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు గుమిగూడారు.

వేలాది మంది సంఘీభావం తెలిపినా కోర్టు ఆదేశాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎక్కడా మాట్లాడలేదు. కార్యకర్తలు సంయమనంతో సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు చంద్రబాబునాయుడు పెరవలి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బాబు కాన్వాయ్ తణుకు చేరుకుంది. అక్కడ చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది కార్యకర్తలు తరలిరావడంతో కాన్వాయ్ నెమ్మదిగా కదిలింది. తణుకులో టీడీపీ ఇన్చార్జి అరుమిల్లి రాధాకృష్ణకు ఘనస్వాగతం పలికారు.

click me!