ఆ నిధుల గురించి పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు: బాబు

First Published Aug 3, 2018, 5:02 PM IST
Highlights

 రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై  టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో  బాగా పోరాటం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించిన  విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరు చరిత్రలో నిలిచిపోతోందన్నారు. 

విజయవాడ: రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై  టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో  బాగా పోరాటం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించిన  విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరు చరిత్రలో నిలిచిపోతోందన్నారు. 

కృష్ణా జిల్లా తాతకుంట్లలో శుక్రవారం నాడు జరిగిన  గ్రామదర్శిని కార్యక్రమంలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీల పోరాటంతో  ఢీల్లీ గడగడలాడిందన్నారు.  ఏపీని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందన్నారు. 

పార్లమెంట్‌లో మన ఎంపీలు గొప్పగా పోరాడారని, మన ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారని సీఎం చంద్రబాబు కొనియాడారు.వైసీపీ అవిశ్వాసం పెడతామని తోకముడిచిందన్నారు.  టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తే చాలా పార్టీలు ముందుకు వచ్చి అవిశ్వాసానికి మద్దతుగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు.  రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై  టీడీపీ ఎంపీలు  చేసిన పోరాటం అభినందనీయమన్నారు. 

కట్టుబట్టలతో, అప్పులతో ఏపీకి తిరిగి వచ్చామన్నారు.  ఆదాయం కూడ లేదన్నారు. అయితే అన్ని సమస్యల్లో ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. నాలుగేళ్లలో  ఎంతో అభివృద్ధి సాధించినట్టు ఆయన చెప్పారు.  ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం అభివృద్ధిలో మరింత దూసుకెళ్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

 రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ  29 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడూ ఎన్డీఏలో చేరాం, ఆ ప్రయోజనాలను కాపాడనందుకే  ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  గతంలో గట్టిగా ఉండేవాడన్నారు.

కానీ ఎందుకో సడన్‌గా యూ టర్న్ తీసుకొని తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు.  రాష్ట్రానికి సుమారు రూ.75 వేల కోట్లు రావాలని జనసేన ఏర్పాటు చేసిన నిజనిర్దారణ వేదిక తేల్చిందని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కానీ, దాని గురించి పవన్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని ఆయన ప్రకటించారు. రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో  రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.  ఇచ్చిన మాట తప్పింది, యూ టర్న్ తీసుకొంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.
 

click me!