ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యూడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యూడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. నేడు రిమాండ్ ముగియడంతో చంద్రబాబును పోలీసులు వర్చువల్‌గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేరసిన పిటిషన్‌లపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోమారు పొడిగించే అవకాశం ఉంది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సెప్టెంబర్ 10వ తేదీన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. చంద్రబాబుకు సెప్టెంబర్ 24 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో.. సీఐడీ అధికారులు చంద్రబాబును రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారించారు. సెప్టెంబర్ 24న చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో.. సీఐడీ అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి.. చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడగించారు. అది నేటితో ముగియనుంది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. బుధవారం కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరగగా.. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఆ తర్వాతే దీనిని సిమెన్స్ భాగస్వామ్యంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రమోద్ దూబే వాదించారు. ఈ కేసులో ఇతర నిందితులకు గతంలో బెయిల్ మంజూరైందని ప్రస్తావించారు. మరోవైపు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పారిపోయారని, వారు ఎలాంటి తప్పు చేయకుంటే పరారీలో ఉండేవారు కాదని అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వడానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించిందని, అదే విధంగా కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బీఎస్‌వీ హిమబిందు ఈ విషయాన్ని అక్టోబర్ 5కు పోస్ట్ చేశారు.