నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్టుగా వక్రీకరించారు: చంద్రబాబు నాయుడు

Published : May 09, 2022, 03:11 PM IST
నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్టుగా వక్రీకరించారు: చంద్రబాబు నాయుడు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నియోజవర్గ ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.

కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీది డైవర్షన్ పొలిటిక్స్ అని మండిపడ్డారు. సోమవారం పార్టీ నియోజవర్గ ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్‌కు అర్ధమైపోయిందని చెప్పుకొచ్చారు. జగన్ సింహం కాదు పిల్లి అని ఎద్దేవా చేశారు. జగన్ భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. పార్టీని మరింతగా బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. బాదుడే బాదుడును ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. 

గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని చంద్రబాబు చెప్పారు. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అని నినాదాలు చేశారని.. కానీ జై జగన్ అన్నట్టుగా మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని అన్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని పేర్కొన్నారు. 2024 ఎన్నికలే వైసీపీ చివరివి అని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా పొత్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చంద్రబాబు నాయుడు కాకినాడలో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్న ఆయన.. అవసరమైతే త్యాగాలకూ సిద్ధమని ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు.. పొత్తుల జనసేకు పరోక్షంగా సంకేతాలు పంపారనే ప్రచారం సాగింది. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలి. వ్యక్తిగతంగా లాభాపేక్ష ఆశించి పొత్తులకు వెళ్లనని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలి.. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందన్నారు. వైసీపీ నాయకులు సింహం సింగిల్‌గా వస్తుందనే డైలాగ్‌లు కొడుతున్నారని.. తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో.. ఎలా రాజకీయాలో చేయలో మీరు నేర్పుతారా అని పవన్ ప్రశ్నించారు. ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇక, నిన్న చంద్రబాబు మాట్లాడుతూ..  వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నాశనమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మళ్లీ కోలుకోలేనంతగా రాష్ట్రాన్ని నాశనం చేశారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో వుండి టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లారని చంద్రబాబు గుర్తుచేశారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్పవాడా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వుందని.. ఈసారి వైసీసీకి ఎక్కడా డిపాజిట్లు రావని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఎన్నికల పొత్తుల గురించి కామెంట్‌ చేయనని చంద్రబాబు అన్నారు. అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu