Latest Videos

ఇలా పోలింగ్ ముగియగానే అలా మాయం ... జగన్ ఫారెన్ టూర్... మరి చంద్రబాబు, పవన్..? 

By Arun Kumar PFirst Published May 24, 2024, 12:43 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నాయకుల సందడి లేదు... ప్రచార హోరు లేదు. ఇలా పోలింగ్ ముగియగానే అలా ఆంధ్ర ప్రదేశ్  నుండి మాయం అయ్యారు ప్రధాన పార్టీల అధినేతలు. ప్రస్తుతం టిడిపి, వైసిపి, జనసేన అధినేతలు ఎక్కడెక్కడ వున్నారంటే... 

అమరావతి : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఈ ఎన్నికలను చేపడుతోంది భారత ఎన్నికల సంఘం... ఇందులో ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి వుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు ఒక ఎత్తయితే... ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మరోఎత్తు. నాలుగో దశలోనే అంటే మే 13న ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతో పాటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది... అయినా ఇంతవరకు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తగ్గలేదు. పోలింగ్  ముగిసి పదిరోజులు దాటినా ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. 

రాజకీయ ప్రత్యర్థులు వైసిపి,  టిడిపి మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వుంటుంది. అలాంటి ఎన్నికల సమయంలో పరిస్థితి మరీ దారుణం... ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు మరింత రెచ్చిపోతుంటారు. ఈ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలోనే అదే జరిగింది. పోలింగ్ నోటిఫికేషన్ నుండి ఇటీవల పోలింగ్ ముగిసేవరకు వైసిపి, టిడిపి కూటమి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ పూర్తయ్యింది కాబట్టి పరిస్థితి ప్రశాంతంగా మారుతుందని అందరూ అనుకున్నారు... కానీ అలా జరగడంలేదు. ఇప్పటికీ పల్నాడు వంటి ప్రాంతాల్లో అలజడులు కొనసాగుతున్నాయి.  ఇలాంటి సమయంల పార్టీ శ్రేణులను సముదాయించి రాష్ట్రంలో శాంతియుత వాతావరణం వుండేలా చూడాల్సిన బాధ్యత గల ప్రధాన పార్టీల అధినేతలు ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ ముగియగానే రాష్ట్రం ఎటుపోతే మాకెందుకు అనుకున్నారో ఏమో నాయకులంతా హాలిడే మూడ్ లోకి వెళ్లిపోయారు.   

ఆంధ్ర ప్రదేశ్ దాదాపు నెల రోజులపాటు ఎన్నికల హడావిడి జోరుగా సాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దం సభలు, బస్సు యాత్రలతో ప్రజలవద్దకు వెళ్లారు. ఇక ప్రతిపక్ష కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కూడా నిత్యం ప్రజల్లోనే వున్నారు. వీరంతా మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేపట్టారు. ఇక అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలంతా సమావేశాలు, ఇంటింటి ప్రచారాలు, రోడ్ షో, ర్యాలీలు... ఇలా ఏదో ఒక పేరుతో ప్రచారంలో వున్నారు. మైక్ సెట్ మోతలు, బ్యాండ్ చప్పుళ్లు, పార్టీల నినాదాలతో నగరాలు, పట్టణాలే కాదు మారుమూల గ్రామాలు సైతం మారుమోగాయి. పోలింగ్ వరకు ఇదంతా... ఒక్కసారి ఈవిఎంలలో ప్రజా తీర్పు నిక్షిప్తం కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ప్రజల్లో వున్న నాయకుల్లో కొందరు ఇప్పుడు కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రలు, మరికొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు  ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి :  
 
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిగా వచ్చినా వైసిపి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. దీంతో పార్టీని గెలిపించుకునే బాధ్యత వైఎస్ జగన్ తీసుకున్నారు. నోటిఫికేషన్ కు ముందునుండే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా దాదాపు నెలరోజులపాటు అసలు విరామం అన్నదే లేకుండా ప్రచారం నిర్వహించారు. ఇలా ఎన్నికల ప్రచారంతో బాగా అలసిపోయిన జగన్ ప్రస్తుతం భార్యాపిల్లలతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు. 

మే 17న ప్రత్యేక విమానంలో భార్య భారతితో కలిసి విజయవాడ విమానాశ్రయం నుండి లండన్ వెళ్ళారు జగన్. అక్కడ చదువుకుంటున్న కూతుళ్లతో కలిసి ఆయన ప్రాన్స్, స్విట్జర్లాండ్ లతో పర్యటిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదంటే జూన్ ఫస్ట్ న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. 

చంద్రబాబు నాయుడు : 

తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. పోలింగ్ ముగియగానే తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు చంద్రబాబు దంపతులు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం వారణాసి వెళ్లారు. అనంతరం మహారాష్ట్రలోకి ప్రముఖ దేవాలయాలను సందర్శించారు.  కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని, షిరిడి సాయిబాబను భార్య భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలోనే వుంటూ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు.  

పవన్ కల్యాణ్ : 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుండి ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం అయ్యారు. తాను పోటీచేసిన పిఠాపురంలోనే ఓ ఇంటిని తీసుకుని వున్నారు. జనసేన  అభ్యర్థులతో పాటు కూటమి తరపున ముమ్మర ప్రచారం నిర్వహించారు. పోలింగ్ రోజు వరకు ఏపీలోనే వున్నారు పవన్ కల్యాణ్. 

అయితే పోలింగ్ రోజున మంగళగిరిలో ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడినుండి విమానంలో వారణాసికి  చేరుకుని రాత్రి బస చేసారు. ఆ తర్వాతి రోజు ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పనిలో పనిగా భార్యతో కలిసి కాశీ విశ్వనాథుడికి దర్శించుకున్నారు. అనంతరం పవన్ దంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ షూటింగ్ లలో కూడా పాల్గొనడం లేదట... ఇంటికే పరిమితమై కుటుంబంతో గడుపుతున్నట్లు సమాచారం. అయితే పవన్ కొద్దిరోజులు భార్యతో కలిసి విదేశాలకు హాలిడే ట్రిప్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 


 

click me!