ఇందిరా గాంధీ చేశారు, ఎంతో ఆనందంగా ఉంది: చంద్రబాబు

By rajesh yFirst Published Sep 12, 2018, 3:18 PM IST
Highlights

తన గొంతులో ప్రాణమున్నంత వరకు అపజయమనేదే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను విఫలమైతే, విజయం ప్రతిపక్షాలది కాదన్నారు. తాను అనుకున్నవి సాధించి తీరతాననే నమ్మకం ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 

అమరావతి: తన గొంతులో ప్రాణమున్నంత వరకు అపజయమనేదే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను విఫలమైతే, విజయం ప్రతిపక్షాలది కాదన్నారు. తాను అనుకున్నవి సాధించి తీరతాననే నమ్మకం ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి బాండ్ల రూపంలో రూ. 2వేల కోట్లు వచ్చాయంటే అదీ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసమన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, గ్యాలరీ వాక్‌ చెయ్యడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే, ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్‌ చేశారని గుర్తు చేశారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని గ్యాలరీలో నడవడం ఒక చరిత్ర అని అభిప్రాయపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్న సీఎం పోలవరం ప్రాజెక్టుకు తాను కోఆర్డినేటర్‌గా వ్యవహరించానని తెలిపారు. చరిత్ర తిరగరాయడానికి ఇంజనీర్లు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 
 
పోలవరం ప్రాజెక్టుకు ఉన్నంత పెద్ద స్పిల్‌వే, ఇంత లోతైన డయా ఫ్రం వాల్ ప్రపంచంలో ఎక్కడా లేదని చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్రలో తొందరగా పూర్తయిన జాతీయ ప్రాజెక్టుగా  పోలవరం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రికార్డులన్నీ పోలవరానికే రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 414 రోజుల్లో డయాఫ్రం వాల్ కట్టామని అది చరిత్రని సీఎం అభివర్ణించారు. ఒకే రోజు 11వేల 150 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశామన్నారు.
 
మరోవైపు పోలవరం ప్రాజెక్టు గురించి నీతి అయోగ్‌లో చర్చ జరిగిందని తెలిపారు. పోలవరం లాంటి ప్రాజెక్టును ఏపీ తప్ప ఎవరూ పూర్తి చేయలేరన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే పోలవరం బాధ్యత తనకు అప్పగించారని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టిసీమ పూర్తిచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నవాళ్లు 10 నెలల్లో పూర్తిచేస్తే ఎవరూ మాట్లాడటం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

click me!