కేంద్రం నుంచి మరోసారి చంద్రబాబుకు ఆహ్వానం.. ఫోన్ చేసిన కేంద్ర మంత్రి..!

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 2:03 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కేంద్రం ఆహ్వానించింది. ఈ సమావేశం డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కేంద్రం ఆహ్వానించింది. ఈ సమావేశం డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ-20 దేశాల సమావేశం జరగనున్నా సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యచరణ రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. పార్టీల నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. 

అయితే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే డిసెంబర్ 5న జరగనున్న సమావేశం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశాలకు హాజరు కావాల్సిందిగా కేంద్రం చంద్రబాబు నాయుడును ఆహ్వానించడం ఇది రెండోసారి. అయితే ఈ సమావేశానికి చంద్రబాబు హాజరుతారనే టీడీపీ వర్గాల చెబుతున్నాయి. 

ఇటీవల.. ఆగస్టులో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత.. మోదీతో చంద్రబాబు నాయుడు వేదిక పంచుకోవడం అదే మొదటి సారి. ఇక, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత.. ప్రధాని  మోదీ సమావేశంలో పాల్గొన్న ప్రముఖలను వారి వద్దకు వెళ్లి పలకరించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చిన ఆయనతో కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. వారిద్దరు ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అయితే ఆ సంభాషణ స్నేహపూర్వకంగా సాగిందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ‘‘మీరి మధ్య ఢిల్లీ రావడం లేదు.. అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తూ ఉండండి’’ అని చంద్రబాబుతో ప్రధాని మోదీ అన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇక, బీజేపీతో బంధం తెంచుకుని 2019లో జరిగిన సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఆ ఎన్నికల సమయంలో బాలకృష్ణతో పలువురు టీడీపీ నాయకులు.. బీజేపీ, మోదీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కూడా మోదీకి వ్యతిరేకంగా పలు పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో.. ఎన్టీయే బంధాన్ని తెంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమని చంద్రబాబు అంగీకరించారు. 

click me!