సీఎం జగన్ రిలీఫ్ పండ్ కు విరాళాలు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Apr 18, 2020, 7:58 AM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనాపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన అన్నారు.

హైదరాబాద్:  కొవిడ్ 19 వైరస్ నియంత్రణ, లాక్ డౌన్ పరిస్థితులపై ప్రతిరోజూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో టెలి, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా చర్చిస్తున్నామని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.  

ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని తగు చర్యల నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తూ ఈరోజు లేఖ రాసినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి పేదలు, పంట అమ్ముడుపోక రైతులు, వ్యాపారాలు దెబ్బతిని వర్తకులు, పారిశ్రామికవేత్తలు ఆర్థిక ఇబ్బందుల పడుతున్నారని, ఈ స్థితిలో సీఎం ఆర్ఎఫ్ కు విరాళాలు ఇమ్మంటూ కొందరు వైసీపీ నేతలు బలవంతపు వసూళ్ళకు దిగడం దారుణమని ఆయన అన్నారు. 

విరాళం అంటే స్వచ్ఛందంగా ఇచ్చేది, భయంతో ఇచ్చేది కాదని చంద్రబాబు అన్నారు. ఇకపోతే సహాయక చర్యల్లో కూడా వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడాన్ని గర్హిస్తున్నామని ఆయన అన్నారు. రూ.1000 నగదు, నిత్యావసరాల పంపిణీలను వైసీపీ నేతలు భౌతిక దూరం పాటించకుండా గుంపుగా తిరుగుతూ స్థానిక ఎన్నికల అభ్యర్థుల చేతుల మీదుగా పంచడం ఏమిటని ప్రశ్నించారు. 

పార్టీలకు అతీతంగా అందించాల్సిన సాయం కొందరికే ఇవ్వడం ఏమిటని ఆయన అడిగారు. కరోనా పై సరైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకుండా హెల్త్ బులెటిన్ ఒకలా, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఒకలా, డ్యాష్ బోర్డులో ఒకలా చెబుతున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాలతో ఇటు ప్రజలను, అటు కేంద్రప్రభుత్వాన్నీ ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అడిగారు.  

వైసీపీ నేతల నిర్వాకాలవల్లే కరోనా ప్రబలిపోతోందని అన్నారు. ప్రపంచంలోని పాలకులందరూ కరోనాతో యుద్ధం చేస్తూ, ప్రజలను ఆదుకుంటూ, వారిలో భరోసా పెంచడానికి కృషిచేస్తుంటే... మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలపైనే దృష్టిపెట్టిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని అన్నారు.

click me!