సంచలనం: చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ టార్గెట్ ?

First Published Mar 22, 2018, 10:42 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు పలువురు మంత్రులను కేంద్రం టార్గెట్ చేస్తోందా?

చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు పలువురు మంత్రులను కేంద్రం టార్గెట్ చేస్తోందా? వైలనంత త్వరలో వారిపై సిబిఐ దాడులు జరుగనున్నాయా? ఈ ప్రశ్నలు టిడిపిని పట్టి కుదిపేస్తున్నాయి. ఎందుకంటే, గురువారం ఉదయం ఎంపిలు, కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినపుడు అవే అనుమానాలను వ్యక్తం చేశారు. ‘మనపై కేంద్రం కక్షసాధింపులకు దిగవచ్చు’ అని అప్రమత్తం చేశారట. కక్ష సాధింపుల్లో భాగంగా తనపైన, లోకేష్ తో పాటు మంత్రులపైన కూడా సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు చంద్రబాబు చెప్పారట. చంద్రబాబే స్వయంగా సిబిఐ విచారణ అంటూ చెప్పటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశంపార్టీ బయటకు వచ్చేసినప్పటి నుండి ఇదే విషయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇందులో నిజమెంతో తెలీదు కానీ రాజకీయ పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నట్లే కనబడుతోంది.

గడచిన మూడు రోజులుగా టిడిపి నేతల మధ్య కూడా అదే చర్చలు జరుగుతున్నాయి. మూడున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పుడపుడు బిజెపి నేతలు విమర్శిస్తునే ఉన్నారు. ఎప్పుడైతే టిడిపి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిందో అప్పటి నుండే చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.

అవినీతి గురించి ఆరోపణలు చేయటమే కాకుండా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్దపడాలంటూ అసెంబ్లీలోనే సవాలు విసురుతున్నారు. అవినీతి జరిగింది అనేందుకు పోలవరం, పట్టిసీమ ప్రజాక్టులను, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను కూడా ప్రస్తావిస్తున్నారు. అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టినట్లు కూడా ఆరోపిస్తున్నారు.

బిజెపి నేతల ఆరోపణలు దాడి పెరుగుతుండటంతో నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలీదుకానీ ‘త్వరలో సిబిఐ దాడులు’ అంటూ జరుగుతున్న ప్రచారం మాత్రం రాష్ట్ర రాజకీయాలను పట్టి కుదిపేస్తోంది.

click me!