సంచలనం : వైసిపి అవిశ్వాసానికి టిడిపి మద్దతు

First Published Mar 15, 2018, 3:42 PM IST
Highlights
  • రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నమ్మలేనంతగా మారిపోతున్నాయి.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నమ్మలేనంతగా మారిపోతున్నాయి. నమ్మలేనంతగా అని ఎందుకనాల్సి వచ్చిందంటే, వైసిపి ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది కాబట్టి. అవును మీరు చదువుతున్నది నిజమే. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా టిడిపి మద్దతు ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు స్పష్టం చేశారట. రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం చాలా కీలక పరిణామమే.

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి చంద్రబాబు, లోకేష్ పై చేసిన ఆరోపణలు, విమర్శలతో చంద్రబాబు, టిడిపి నేతలు మండిపోతున్నారు. పవన్ చేసిన ఆరోపణలు, విమర్శల వెనుక బిజెపి హస్తముందని చంద్రబాబుతో పాటు టిడిపి మొత్తం నమ్ముతోంది. అందుకనే ఉదయం నుండి నిర్వహిస్తున్న పార్టీ సమావేశాల్లో చంద్రబాబు పదే పదే కేంద్రంపై విరుచుకుపడుతున్నారు.

శుక్రవారం ఉదయం పొలిట్ బ్యూరో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఎన్డీఏలో కొనసాగే విషయంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. టిడిపి విషయంలో కేంద్రం లేదా బిజెపి అనుసరిస్తున్న వైఖరిని దృష్టిలో పెట్టుకునే రేపటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలన్న సంచలన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు.

 

click me!