
అమరావతి: తాము ఎన్డీఎతో అప్పుడెందుకు కలిశాం, ఇప్పుడెందుకు విడిపోయామనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకోవడానికి ఎన్డీఎతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన వల్ల మనకు చాలా అన్యాయం జరిగిందని, చాలా కష్టాలతో పరిపాలనను ప్రారంభించామని ఆనయ అన్నారు. ఎపికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎన్డీఎ నుంచి బయటకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడు మనపై బాధ్యత మరింతగా పెరిగిందని, హక్కుల కోసం ఓ వైపు పోరాడుతూనే అభివృద్ధి చేసుకోవాలని ఆయన అన్నారు. గట్టిగా అడకపోతే ఇంకా నష్టపోతామనే ఉద్దేశంతో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
సమస్యల్లో మనకు కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. ఉమ్మడి కృషితో నాలుగేళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు, ప్రజల్లో సంతృప్తి పెరిగినట్లు ఆయన తెలిపారు.