సూపర్ స్టార్ కృష్ఱ తనయుడు రమేష్ బాబు మృతి... చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతాపం

By Arun Kumar PFirst Published Jan 9, 2022, 9:35 AM IST
Highlights

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ఘట్టమనేేని రమేష్ బాబు మ‌ృతిపై టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. 

అమరావతి: సూపర్ స్టార్ కృష్ణ (superstar krishna) తనయుడు, మహేష్ బాబు (mahesh babu) సోదరుడు రమేష్ బాబు (ramesh babu) మృతిపై మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సంతాపం తెలిపారు. ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. రమేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు కోరుకున్నారు. 

రమేష్ బాబు మృతి ఘట్టమనేని (ghattamaneni family) కుటుంబాన్ని బాధకు గురిచేసిందని... వారికి తన  ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయం లో కృష్ణ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు అన్నారు. 

రమేష్ బాబు మృతికి జనసేన (janasena) అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా సంతాపం తెలిపారు. సినీనటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని తెలిపారు. 

''ప్రముఖ నటులు కృష్ణ గారి నట వారసత్వాన్ని రమేష్ బాబు కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలోకి వచ్చి విజయాలు అందుకున్నారు. సోదరుడు మహేష్ బాబుతో ‘అర్జున్’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు'' అని పవన్ కల్యాణ్ గుర్తుచేసారు. 

''కృష్ణ గారు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిది. ఆయనకు, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.  రమేష్ బాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను'' అని పవన్ కల్యాణ్ తెలిపారు. 

రమేష్ బాబు మృతికి తెలుగు  సినీప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ప్రముఖనటులు చిరంజీవి (chiranjeevi) రమేష్ బాబు మరణవార్త తెలియగానే కృష్ణ వద్దకు వెళ్ళి పుత్రశోకంతో బాధపడుతున్న ఆయనను ఓదార్చారు. రమేష్ బాబు మృతి ఘట్టమనేని కుటుంబాన్నే  కాదు తెలుగుసినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిందన్నారు.  

ఇక రమేష్ బాబు సినీ ప్రస్థానం ఒడిదుడుకులతో సాగింది. తన తండ్రి కృష్ణ కేరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అల్లూరి సీతారామరాజు చిత్రంతో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు రమేష్‌బాబు. అప్పటికి ఆయన వయసు కేవలం తొమ్మిదేళ్లు. ఈ సినిమాలో బాల అల్లూరిగా నటించి మెప్పించారు.  

ఆ తర్వాత కృష్ణ నటించిన `మనుషులు చేసిన దొంగలు` చిత్రంలో బాలనటుడిగా మెప్పించారు. ఆ తర్వాత `నీడ` సినిమాలో మంచి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో మహేష్‌బాబు కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. వీటితోపాటు `దొంగలకు దొంగ`, `అన్నదమ్ముల సవాల్‌`, `నీలు` చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు.  

ఇక టీనేజ్‌లోకి వచ్చిన రమేష్‌ బాబు ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తండ్రి కృష్ణ సారథ్యంలో ఆయన హీరోగా ఎంట్రీ జరిగింది. 1987లో `సామ్రాట్‌` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రమేష్‌బాబు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో హీరోగా నటించినా రాణించలేకపోయిన ఆయన నిర్మాతగా మారారు. అక్కడకూడా సక్సెస్ కాలేకపోయిన రమేష్ బాబు సినీపరిశ్రమకు దూరమయ్యారు. 
 

click me!