ఒకే ఇంట్లో నలుగుర్ని బలితీసుకున్న కరోనా... దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

By Arun Kumar PFirst Published Nov 2, 2020, 2:49 PM IST
Highlights

కేవలం 20రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో కరోనా నలుగురిని బలితీసుకోవడం దారుణమన్నారు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.

విజయవాడ: కరోనా మహమ్మారి కారణంగా సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీతో పాటు ఆయన తల్లి, భార్య, కుమారుడు మృతిచెందడం బాధాకరమని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 20రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో కరోనా నలుగురిని బలితీసుకోవడం దారుణమన్నారు.  కరోనా ఏవిధంగా ప్రజల ప్రాణాలను బలిగొంటుందో... కుటుంబాలను ఎలా అస్తవ్యస్థం చేసిందో ఈ విషాదమే తార్కాణమన్నారు.  సుల్తాన్ ముసావీ కుమార్తెకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించారు. 

 విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన మరణించింది. గత నెల 30వ తేదీన న్యాయవాది భార్య మరణించింది. భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది కూడ మరణించాడు. ఈ ముగ్గురు కూడా కరోనాతో మరణించారు. మరో వైపు కరోనాతో బాధపడుతున్న న్యాయవాది కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించాడు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనాతో మరణించడంతో బంధు మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇటీవల కాలంలో గతంలో కంటే తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రోజూ పదివేల వరకు కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో మూడు వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఈ ఘటన రుజువు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టం తప్పదని ఈ ఘటన రుజువు చేసింది.

click me!