చంద్రబాబుకు కేంద్రం మరో షాక్: ఆ నిధుల నిలిపివేత

By pratap reddyFirst Published Aug 19, 2018, 9:55 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వాటర్ షెడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేసింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వాటర్ షెడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేసింది. దీంతో నీటి సంరక్షణ, పొదుపు కోసం చేపట్టిన పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కొత్తగా మంజూరైన ఆరో బ్యాచ్‌ వాటర్‌షెడ్లను  రాష్ట్రాలు తమ సొంత నిధులతో నిర్వహించాలని ఆదేశించింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 790 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వాటర్‌షెడ్‌ పథకంలో పని చేస్తున్నారు. తొలుత ప్రారంభమైన ప్రాజెక్టులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. దీంతో ఈ ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మంజూరయితేనే వీరి పని ఉంటుంది. అయితే, తాము కొత్త పథకాలను కేటాయించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వీరిలో ఎక్కవమంది అభద్రతకు గురవుతున్నారు. 

కొత్త వాటర్‌షెడ్లు మంజూరు నిలిపేస్తామని ఏడాది కిందటే కేంద్రం హెచ్చరించింది. అయితే, ఈ సిబ్బందిని సర్దుబాటు చేయడానికి శాఖ అధికారులు ప్రయత్నాలు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో ఈ సిబ్బందిని వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా ఆ పని చేయలేదు. వాటర్‌షెడ్‌ సిబ్బందికి ఏడాదికి రూ. 1.20 కోట్లు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. దాంతో ఈ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంపై పడింది.
 
కొత్తగా మరికొన్ని వాటర్‌షెడ్లు తమ రాష్ట్రానికి మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో నిధులు ఇవ్వలేమంటూ కేంద్ర మంత్రి నుంచి సమాధానం వచ్చింది.

click me!