విశాఖ రైల్వే జోన్ పై రైల్వే మంత్రి షాకింగ్ కామెంట్స్..!

By telugu news teamFirst Published Jul 24, 2021, 9:55 AM IST
Highlights

రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇవ్వడం గమనార్హం.

విశాఖపట్నంలో రైల్వే జోన్ రావాలని ఆంధ్రప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ నోరు విప్పనేలేదు. కాగా.. తాజాగా.. ఈ రైల్వే జోను పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.

కొత్త రైల్వే జోన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పలేమని.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇవ్వడం గమనార్హం.

దక్షిణ కోస్తా రైల్వే జోన్  ఇంకా ప్రారంభంకాలేదన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. ఈ జోన్ పై ప్రత్యేక అధికారి సమర్పించిన సవివర నివేదిక పరిశీలనలో ఉన్నందున ఎప్పటినుంచి ప్రారంభమవుతుందో కచ్చితమైన సమయం చెప్పలేమన్నారు.

వాల్తేర్ డివిజన్ ను కొత్త జోన్ లో కొనసాగించే అంశంపై కనకమేడల అడిగిన ప్రశ్నకు మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వాల్తేర్ డివిజన్ ను దక్షిణ కోస్తా జోన్ లోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరుల నుంచి వినతులు అందాయన్నారు.

అయితే.. కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై పరిపాలన, నిర్వహణ అవసరాలతోపాటు ఇతరత్రా అన్ని అంశాలన్నింటినీ పరిణనలోకి తీసుకున్న తర్వాతే రైల్వే శాఖ నిర్ణయం తీసుకొందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

భద్రక్- విజయనగరం మధ్య మూడో లైన్ను మంజూరు చేయడం లేదని.. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రాజెక్టును 2015-16 రైల్వే బడ్జెట్ లో చేర్చారని.. డీపీఆర్ ప్రకారం 385 కిలోమీటర్ల పనికి రూ.3,823 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. ఈ కారణంగానే ప్రాజెక్టును మంజూరు చేయలేదన్నారు.
 

click me!