ఆనందయ్య మందుపై ప్రారంభమైన సీసీఆర్ఏఎస్ పరిశోధన.. 4 దశల్లో విశ్లేషణ..

By AN TeluguFirst Published May 24, 2021, 11:03 AM IST
Highlights

నెల్లూరు జిల్లా, క్రిష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరు పై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ  సీసీఆర్ఏఎస్ నాలుగు దశల్లో ఆ మందును విశ్లేషించింది. 

నెల్లూరు జిల్లా, క్రిష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరు పై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ  సీసీఆర్ఏఎస్ నాలుగు దశల్లో ఆ మందును విశ్లేషించింది. 

మొదటి దశలో భాగంగా మందు తీసుకున్న వారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి సీసీఆర్ఏఎస్ అప్పగించింది.

ఇప్పటికే మందు తీసుకున్న వారి ఫోన్ నెంబర్లను పోలీసులు సేకరించిన నేపథ్యంలో విజయవాడ ప్రాంతీయ పరిశోధన స్థానం, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు మందు తీసుకున్న 500 మంది కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

కరోనా పరీక్షల నివేదిక, మందు వేయించుకున్నప్పటి పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఉన్న పరిస్థితులు, ప్రస్తుత వైద్య నివేదిక వివరాలు సేకరించనున్నారు.

సీసీఆర్ఏఎస్ ప్రొఫార్మా ప్రకారం వివరాలను పొందుపరచనున్నారు. రెండు రోజుల్లో దీనిని పూర్తి చేయాలని ఆయుర్వేద వైద్యులను జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశించింది. మందు ప్రభావం విశ్లేషణ ద్వారా సీసీఆర్ఏఎస్ ప్రాథమిక నిర్ధారణకు రానుంది. 

పూర్తిస్థాయి పరిశోధనలకు నాలుగు నుంచి ఐదు వారాలు పెట్టే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు.  

ఇదిలా ఉండగా, కరోనా రోగులు, ప్రజలు ఆశలు పెట్టుకున్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్, ఆయుష్ సహా నిపుణుల నివేదికలు అందే వరకు మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదికలు రాకుండా మందు పంపిణీ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఐసీఎంఆర్ నివేదికకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 
 

click me!