
గుంటూరు: కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన వర్గీయుల అరెస్ట్ ను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఖండించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్ట్ లు చేయిస్తున్నారని ఆరోపించారు.
''ముఖ్యమంత్రి జగన్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. అకారణంగా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బిసి జనార్థన్ రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని చంద్రబాబు అన్నారు.
''అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలి. కరోనాను నియంత్రించేదానికన్నా ప్రతిపక్షాలను నియంత్రించడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన తీరు మూడు అక్రమ కేసులు ఆరు అరాచకాలు అన్నట్లుగా సాగుతోంది. దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలను వదలిపెట్టి దాడిని అడ్డుకున్న జనార్థనరెడ్డిని అరెస్టు చేయడం రాజారెడ్డి రాజ్యాంగం కాదా? వివాదాలకు దూరంగా ఉండే బీసీ జనార్దన్ రెడ్డి లక్ష్యంగా అక్రమ కేసులతో వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలి''అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
read more సహజీవనం చేసుకోండంటూ... ఆ పనిలో జగన్ బిజీ: నారా లోకేష్ సంచలనం
''రాష్ట్రంలో కరోనాబారిన పడి వేలాది మంది ప్రజలు మరణిస్తుంటే.. నియంత్రించాల్సిన జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు కుట్రలు పన్నుతున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీసీ జనార్థన్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకుల అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం'' అన్నారు అచ్చెన్నాయుడు.
''బిసి జనార్థన్ రెడ్డి పై కక్షపూరితంగా ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయడం దుర్మార్గం. టీడీపీ నేతల ఫిర్యాదును పట్టించుకోకుండా తిరిగి వారిపైనే అక్రమ కేసులు నమోదు చేయడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం. ప్రజానాయకుడిగా ఉన్న బీసీ జనార్థన్ రెడ్డిని అర్థరాత్రి అరెస్ట్ చేయడంలోనే వైసీపీ కుట్ర దాగి ఉంది. జగన్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలు ఎంతోకాలం సాగనీయబోమని హెచ్చరిస్తున్నాం. తక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసిన బీసీ జనార్థన్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులను భేషరతుగా విడుదల చేయాలి. వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి''అని అచ్చెన్న డిమాండ్ చేశారు.