క్యాన్సర్ సోకిన తల్లిని చేతులపై ఎత్తుకొని తిప్పిన కొడుకు, చివరికి...

By narsimha lodeFirst Published Nov 21, 2019, 8:04 AM IST
Highlights

క్యాన్సర్ కు గురైన తల్లికి ఆశ్రయం ఇవ్వకపోవడంతో ఓ కొడుకు అష్టకష్టాలు పడ్డాడు. తల్లిని తన చేతులతో మోసుకెళ్లాడు. చివరికి ఆమె మృత్యువు ఒడిలోకి చేరింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.


ఒంగోలు: అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకొనేందుకు ఓ యువకుడు కష్టాలు పడ్డాడు.అనారోగ్యంగా ఉన్న తల్లితో పాటు ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదు.

 దీంతో ఆ యువకుడు పార్క్‌లోనే టెంట్ వేసి తల్లితో పాటు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక మున్సిపల్ అధికారులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడింది.ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, వెంకటలక్ష్మి దంపతులు పామూరు పట్టణంలో మూడేళ్లుగా నివాసం  ఉంటున్నారు.

వెంకటలక్ష్మి దంపతులకు సతీష్ అనే కొడుకు ఉన్నాడు. సతీష్ వయస్సు 27 ఏళ్లు. సతీష్ మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తున్నాడు.నాలుగు మాసాల క్రితం వెంకటలక్ష్మికి క్యాన్సర్ సోకింది. 

క్యాన్సర్ చికిత్స కోసం వెంకటలక్ష్మిని పలు ఆసుపత్రుల్లో సతీష్ చికిత్స చేయించాడు. అయినా ఫలితం లేకపోయింది.ఆమె చికిత్స కోసం ఆయన రూ. 4 లక్షలను ఖర్చు చేశాడు.అయినా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా వెంకటలక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది.

దీంతో ఈ నెల 18వ తేదీన పామూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటలక్ష్మిని సతీష్ చేర్పించాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంకటలక్ష్మిని రిమ్స్ కు తరలించాలని సూచించారు.

రిమ్స కు తరలించేందుకు గాను సతీష్ తన తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా ఇంటి యజమాని సతీష్ కు ఎదురెళ్లి అనారోగ్యంతో ఉన్న వెంకటలక్ష్మిని తీసుకురాకూడదని హెచ్చరించాడు.

దీంతో సతీష్ ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆసుపత్రిలో ఉంచడానికి వీల్లేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో సతీష్ తన తల్లిని చేతులపై మోసుకొని పంచాయితీ అధికారులు చెత్త నుండి సంపద తయారీ చేసే కేంద్రంలో రాత్రి ఉంచాడు.

ఈ నెల 18వ తేదీ రాత్రి అక్కడే ఉన్నారు. ఈ నెల 19వ తేదీ ఉదయం పంచాయితీ సిబ్బంది వచ్చి సతీష్ ను అక్కడ ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.దీంతో సతీష్ తన తల్లిని చేతులపై మోసుకొంటూ స్థానిక డీవీ పార్క్‌కు తీసుకెళ్లాడు. అక్కడే టెంట్ వేసుకొని ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొన్న అధికారులు వెంకటలక్ష్మిని పామూరు వైద్యశాలలో చేర్చుకోవాలని ఆదేశించారు.

అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20 వ తేదీన మృతి చెందింది. తల్లిని బతికించుకొనేందుకు సతీష్ కష్టపడ్డాడు. కనీసం ఆశ్రయం కల్పించేందుకు కూడ ఎవరూ కూడ ముందుకు రాలేదు.
 

click me!