
బంగారంపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంట్లో ఉన్న బంగారంపై లెక్కలు చెప్పాల్సిందేనని తాజాగా చేసిన ఐటి చట్టంలో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, గురువారం దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చినా నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఇదే విషయమై మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తిలిసింది.
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుండగా ఇపుడు బంగారం జోలికి కూడా వెళితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మంత్రులు సిఎంను హెచ్చరించినట్లు సమాచారం. కేంద్రం నియమించిన కమిటీకి కన్వీనర్ కాబట్టి ఈ విషయంలో కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించాలని మంత్రులు సిఎంకు సూచించినట్లు తెలిసింది. బంగారం జోలికి ఎట్టి పరిస్ధతిల్లోనూ వెళ్లకూడదని కేంద్రానికి గట్టిగా చెప్పాలని కూడా మంత్రులు తెలిపారు.
పెద్ద నోట్ల రద్దుతో నవంబర్ లో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో రూ. 800 కోట్లు నష్టం వచ్చిందని సిఎం మంత్రులకు వివరించినట్లు సమాచరం. ఈ నెలలో రూ 1500 కోట్లు నష్టం వచ్చే అవకాశాలున్నట్లు కూడా చంద్రబాబు మంత్రులతో అన్నట్లు తెలిసింది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై జిల్లా స్ధాయిల్లో కమిటిలు వేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రి ఛైర్మన్ గా కలెక్టర్ ను వైస్ ఛైర్మన్ గా నియమించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.