కొద్ది రోజులైనా ఊహాలోకంలో బతుకు, చంద్రబాబూ ! : వైసీపీ నేత సి. రామచంద్రయ్య

By Nagaraju penumalaFirst Published Apr 13, 2019, 5:07 PM IST
Highlights

చంద్రబాబు అవినీతిపరుడని అన్నా హజారేకు కూడా తెలిసిపోయిందని విమర్శించారు. అందువల్లే ఢిల్లీలో హజారే దీక్షకు చంద్రబాబును ఆహ్వానించలేదన్నారు. ఈవీఎంల్లో చిప్స్‌ మార్చారు, ట్యాంపరింగ్‌ చేశారు అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. అలాంటి బుద్ధులు చంద్రబాబుకే మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు.  

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 

అమరావతిలో పార్టీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన సి రామచంద్రయ్య ఎలక్షన్‌ కమిషన్‌ను తప్పు పట్టడం బాబుకు సరికాదన్నారు. ఈసీని అడ్డుపెట్టుకుని తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ పై ఆరోపణలు చెయ్యడం తగదని హితవు పలికారు. 

ఎలక్షన్‌ కమిషన్‌ మీద తనకు నమ్మకం లేదంటూనే మళ్లీ ఆయనే ఈసీ వద్దకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ఇంటిలిజెన్స్‌ చీఫ్, కొందరు ఎస్పీలు, డీజీపీని గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థను నడిపిద్దామనుకుని ప్రయత్నించారని ఆరోపించారు. 

చంద్రబాబు ఆటలు సాగనివ్వకుండా ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు తీసుకుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చర్యలకు సీఎస్‌ బలిపశువు అయ్యారని ఆరోపించారు. ఈసీపై చంద్రబాబు వేలు చూపిస్తూ మాట్లాడటం దేనికి సంకేతమో చెప్పాలని నిలదీశారు. 

చంద్రబాబు చర్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని అన్నా హజారేకు కూడా తెలిసిపోయిందని విమర్శించారు. అందువల్లే ఢిల్లీలో హజారే దీక్షకు చంద్రబాబును ఆహ్వానించలేదన్నారు. 

ఈవీఎంల్లో చిప్స్‌ మార్చారు, ట్యాంపరింగ్‌ చేశారు అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. అలాంటి బుద్ధులు చంద్రబాబుకే మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయంగా ఎంతో పరిణితి చెందారని స్పష్టం చేశారు. 

చంద్రబాబు పోలింగ్ కి ఒకరోజు ముందు ప్రజల అకౌంట్లో డబ్బులేసినా జగన్ ఎవరికి ఫిర్యాదు చెయ్యలేదని స్పష్టం చేశారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి ప్రజాస్వామ్య విజయం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు బాబును ఊహాలోకంలో బతకనివ్వండంటూ సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల్లో నారా లోకేష్ తోపాటు మంత్రులుగా పనిచేసిన వారంతా ఓటమి పాలవ్వడం తథ్యమన్నారు సి.రామచంద్రయ్య. 

click me!