
కొత్త అసెంబ్లీలోనైనా సమావేశాలు సజావుగా సాగుతాయా? అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి మార్చుకుంటాయా? ఎందుకంటే, మార్చి 3వ తేదీ నుండి కొత్త అసెంబ్లీ భవనంలో బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. మొన్నటి వరకూ సమావేశాలు హైదరాబాద్ లోనే జరిగాయి. అసెంబ్లీ హైదరాబాద్ లో జరిగినంత కాలం సమావేశాలు ఏకపక్షంగానే జరిగాయి. ఏదో కారణంతో వైసీపీ సభ్యులను టిడిపి రెచ్చగొట్టేది. ప్రతిపక్ష సభ్యులు రెచ్చిపోగానే సస్పెండ్ చేసేయటమే. దాంతో సభ మొత్తం గందరగోళమే. గడచిన రెండున్నరేళ్ల సమావేశాలు ఇదే విధంగా సాగాయి.
సరే, కారణాలేవైనా హైదరాబాద్ ను వదిలేసారు. వెలగపూడిలోఅసెంబ్లీ భవనాలూ కొత్తవి కట్టారు. కాబట్టి అధికార పార్టీ ఇప్పటికైనా వైసీపీకి మాట్లాడనిచ్చే అవకాశాలున్నాయా అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, వైసీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి మీడిమాతో మాట్లాడుతూ, కొత్త అసెంబ్లీలోనైనా తమకు మాట్లాడే అవకాశాలివ్వాలని కోరారు. హైదరాబాద్ లో సమావేశాలు జరిగినంత కాలం తమకు మాట్లాడేందుకు అధికార పార్టీ అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ప్రజా సమస్యలను మాత్రమే తాము లేవనెత్తుతున్నట్లు శ్రీకాంత్ చెబుతున్నారు. మరి, సమస్యలను వినేందుకు, జవాబులు ఇచ్చేందుకు టిడిపి సిద్ధమా? సమస్యలను లేవనెత్తటమే ప్రతిపక్షంగా తమ బాధ్యతగా శ్రీకాంత్ చెబుతున్నదాంట్లో తప్పేమీ లేదు. కాకపోతే, రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. ఈ నేపధ్యంలో కొత్త అసెంబ్లీలోనైనా సమావేశాలు సజావుగా సాగితే అంతే చాలు.