కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను ఉళ్లంఘిస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న ఆరోపించారు.
గుంటూరు: కరోనా మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ లో విజృంభిస్తున్న నేపథ్యంలోనే లాక్ డౌన్ విధించి దాన్ని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అలాంటిది లాక్ డౌన్ ను స్వయంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డే ఉళ్లంఘిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఎలా ఉళ్లంఘిస్తున్నాడో వివరిస్తూ ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు బుద్దా వెంకన్న.
డిజిపికి బుద్దా వెంకన్న రాసిన లేఖ యదావిదిగా...
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి నమస్కారం.
విషయం : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీ విజయ సాయి రెడ్డి గారిపై చర్యల కొరకు..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసులు ఎంతగానో కష్టబడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన కార్యక్రమాలు అభ్యంతరకరం. విశాఖ జీవీఎంసీ పరిధిలోని వెల్లంపేటలో కనీస భౌతిక దూరం పాటించకుండా గుంపుగా కార్యక్రమం నిర్వహించారు. ఇదే విధంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రం, కోటబొమ్మాళి భౌతిక దూరం అనే నిబంధనను ఉల్లంఘించారు.
ఒక జిల్లా నుండి మరో జిల్లాకు ప్రజలు వెళ్లొద్దని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని సైతం వెనక్కి పంపుతున్నారు. కానీ విజయ సాయి రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తిరుగుతున్నారు. ఇది లాక్ డౌన్ ఉద్దేశ్యాన్ని తుంగలో తొక్కడం కాదా.? ఒక ఎంపీగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా నిబంధనలు గాలికి వదిలి కరోనా వ్యాప్తికి కారణం అవుతూ సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు.?
నిన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల సహాయం కోసం కారులో నలుగురితో వచ్చినా అరెస్టు చేసి, కేసు పెట్టి, కారు స్వాధీనం చేసుకున్నారు. మరి విజయ సాయి రెడ్డి బహిరంగంగా వందల మంది సమక్షంలో సభలు నిర్వహిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు.? ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు కారు సీజ్ చేయలేదు? అధికారంలో ఉన్న వారికి చట్టం వర్తించదా.? పోలీస్ కేస్ నమోదు అవ్వదా? ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా విజయ సాయి రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్నా, రోజు రోజుకూ కొత్త కేసులు నమోదు అవుతున్నా శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేస్ కూడా నమోదు కాలేదు. అలాంటి ప్రాంతంలో వందలాది మందితో సభలు, సమావేశాలు నిర్వహించి అక్కడి ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు.? స్వప్రయోజనాల కోసం, సొంత మైలేజీ కోసం వైఎస్సార్సీపీ నేతలు ఎంతలా ఆరాటపడుతున్నారు, ప్రజల ప్రాణాలు అంటే ఎంత ఉదాసీనంగా ఉన్నారో విశాఖ, శ్రీకాకుళం ఘటనలతో స్పష్టం ఐయ్యింది.
పాలకులు బాధ్యతగా, ప్రజా క్షేమం కోసం పని చేయాలి. కానీ విజయ సాయిరెడ్డి చేస్తున్న పనులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. ఇలా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన విజయ సాయి రెడ్డి పై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
బుద్ధా వెంకన్న,
టీడీపీ విప్ - శాసనమండలి.