కరోనా నుంచి కోలుకుని స్వదేశానికి: ప్రభుత్వంపై బ్రిటన్ వాసి ప్రశంసలు

By Siva Kodati  |  First Published Apr 16, 2020, 10:20 PM IST
తిరుపతి శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో కోవిడ్‌-19 సోకిన బ్రిటన్ జాతీయుడిని ఉంచారు. వైరస్ నుంచి కోలుకున్న అతనిని అధికారులు గురువారం డిశ్చార్జ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతమూ పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఇదే సమయంలో కొందరు వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో కోవిడ్‌-19 సోకిన బ్రిటన్ జాతీయుడిని ఉంచారు.

వైరస్ నుంచి కోలుకున్న అతనిని అధికారులు గురువారం డిశ్చార్జ్ చేశారు. క్వారంటైన్‌లో తనకు ఇక్కడి వైద్యులు బాగా చికిత్స చేశారని.. ప్రతిరోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించారని అతను చెప్పాడు. ఇక్కడి సిబ్బంది ఎంతో మంచివారని.. తనను బాగా చూసుకున్నారని ప్రశంసించాడు. 

ఇదిలావుండగా, గురువారం ఉదయం లెక్కల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరుకుంది.

కొత్తగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో మూడేసి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 20 మంది డిశ్చార్జీ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఏ విధమైన కేసులు నమోదు కాలేదు.
click me!