ఏం చేశారో చూపిస్తే తలదించుకుని మీ ముందు నిలబడతా: బొత్స సవాల్

By Nagaraju TFirst Published Sep 20, 2018, 4:48 PM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత  బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం దోచుకుందాం.. దాచుకుందాం అనే రీతిలో పరిపాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. విజయనగరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స టీడీపీపై ధ్వజమెత్తారు. 

విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తామేనని స్పష్టం చేశారు. తమ హయాంలో జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ, ఆంధ్రా యూనివర్శిటీ, జూనియర్ కళాశాలలు తీసుకువచ్చామని తెలిపారు. టీడీపీ నేతలు ఏం తెచ్చారో చూపించాలని తెలిపారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రామతీర్థ సాగర్ ప్రాజెక్టును తమ హయాంలో మెుదలుపెడితే టీడీపీ నేటికి పూర్తి చెయ్యలేకపోయిందని ఆరోపించారు. 

ఇంటికో రేటు, పెన్షన్ కో రేట్ పెట్టి వసూలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ నాయకులు తాతగారి ఆస్తుల్లా 1300కోట్లు అప్పనంగా చెల్లించారని కాగ్ బయటపెట్టిందన్నారు. సీఎంకి ప్రైవేట్ సంస్థలకు వాటాలు నప్పకే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం తేలట్లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద పడుకుని పూర్తి చేశానని చంద్రబాబు అనడం హాస్యాస్పదం అన్నారు.  

మరోవైపు రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్‌ క్రిష్ణ రంగారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజులపైనా నిప్పులు చెరిగారు. జిల్లా అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామన్నాసుజయ్ కృష్ణ రంగారావు ఈ మూడేళ్లలో ఏం అభివృద్ది చేశారో ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేసినట్లు చూపిస్తే తలదించుకుని మీ మందు నిలబడతానని సవాల్ విసిరారు. ఆస్తులు కాపాడుకోవడానికి, దందాలు చేసుకోడానికి సుజయ్ పార్టీ మారారని తెలిపారు. 

అటు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి హోదా కోసం ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసిన అశోక్ ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో ఎలా జతకడతారని ప్రశ్నించారు. రోశయ్య మీటింగ్‌లో రాష్ట్ర విభజనకి అనుకూలమని చెప్పింది అశోక్ గజపతిరాజేనని స్పష్టం చేశారు. 

భోగా పురం ఏయిర్‌పోర్టు టెండర్లు రద్దు చేసి ప్రయివేట్‌ వారికి ముడుపులు తీసుకుని అప్పజెప్పాలను కోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టెండర్లు ప్రైవేట్ వారికి ముడుపులు తీసుకుని అప్పజెప్పాలన్నది నిజమో కాదో మీ ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.  
 
ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి వారికి ఓ భరోసా ఇచ్చేందుకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాకు చేరుకోనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. 

వైఎస్‌ జగన్‌కు కుర్చి మీద ధ్యాస అంటూ అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను బొత్స ఖండించారు. నిజం జగన్‌కి కుర్చి కావాలి. పదవి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలరన్నారు. సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి.. కావాల్సిందేనన్నారు. విజయనగరం జిల్లాలో జగన్ మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకోవడం చారిత్రాత్మకమన్నారు బొత్స.  

click me!