
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలికి తాము అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. వాసిరెడ్డి పద్మ ఘటన జరిగిన మూడు రోజులకు బాధితురాలని పరామర్శించేందుకు వచ్చారని అన్నారు. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు తాము విచారణకు వెళ్లమని చెప్పారు. వాసిరెడ్డి పద్మ అధికార దుర్వినియోగంపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. విజయవాడ అత్యాచార ఘటనపై తూతూ మంత్రంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు.
వాసిరెడ్డి పద్మ బజారు మనిషిలా మాట్లాడుతున్నారని బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘వాసిరెడ్డి పద్మ అరేయ్ అని మాట్లాడుతున్నారు.. మేము ఒసేయ్ అని అనలేమా’’ అని అన్నారు. వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబాన్ని రోడ్డుకు లాగారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వ చర్యలు శూన్యం అని అన్నారు. వాసిరెడ్డి పద్మ.. మహిళా హక్కులు కాపాడేందుకు ఉన్నారా?, వైసీపీ హక్కులు కాపాడేందుకు ఉన్నారా? అని ప్రశ్నించారు.
ఇక, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ శ్రేణులు అడ్డుకుని గొడవకు దిగారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడకు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు మహిళ కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్దం నడుస్తోంది.