చంద్రబాబుకు హెచ్చరికలు: కేశినేనిపై బోండా ఉమా, బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Mar 6, 2021, 12:14 PM IST
Highlights

విజయవాడ టీడీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. ఈ విభేదాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించాయి. కేశినేని నానిపై బొండా ఉమా, బుద్ధా వెంకన్న బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: పార్టీ విజయవాడ నేతల మధ్య నెలకొన్న విభేదాలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా పరిణమించాయి. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎంపీ కేశినేని నానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసే పద్ధతిలో మాట్లాడారు.

కేశినేని కావాలంటే ఆయననే పక్కన పెట్టుకుని వెళ్లండని వారు చంద్రబాబును హెచ్చరించారు. కేశినేని నాని ఉంటే చంద్రబాబు పర్యటనలో తాము ఉండబోమని వారు చెప్పారు. కేశినేని నానిని నియంత్రించాలని వారు చంద్రబాబును కోరారు. కేశినేని అహంకారంతో మాట్లాడుతున్నారని, చంద్రబాబును ఎదిరించి మాట్లాడుతున్నారని ఆయన వారన్నారు. 

తాము విజయసాయిరెడ్డి మీద పోరాటం చేస్తుంటే కేశినేని ఆయనను లంచ్ కు పిలిచారని వారన్నారు. కేశినేని నాని ఎంపీగా పార్టీ టికెట్టుపై గెలిచారని వారు చెప్పారు. సొంత గ్లామర్ తో గెలిచానని కేశినేని అనుకుంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని, అలా కేశినేని నాని గెలిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకోవడమే కాకుండా కట్టుబట్టలతో విజయవాడ వదిలేసి పోతామని వారన్నారు. కేశినేని కూతురును విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల తమకేమీ అభ్యంతరం లేదని, అయితే కేశినేని నాని తీరు, అహంకారం తమకు నచ్చడం లేదని వారన్నారు. 

కేశినేని నాని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఒంటెత్తు పోకడలను అనుసరిస్తున్నారని వారన్నారు. అధిష్టానాన్ని ఎదిరించి మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తమకు ఓ గొట్టంగాడు కూడా అధిష్టానం కాదని వారు తేల్చి చెప్పారు. కేశినేని నాని ఉంటే తాము ఎన్నికల్లో పనిచేయలేమని తేల్చి చెప్పారు. తాము పార్టీ కోసం పనిచేస్తుంటే కేశినేని నాని పదవుల కోసం పనిచేస్తున్నారని వారన్నారు. టీడీపీని కులసంఘంగా మారుస్తున్నారని వారన్నారు.

చంద్రబాబును ఏకవచనంతో పిలిచినప్పుడే చెప్పుతో కొట్టాలని అనుకున్నట్లు బుద్ధా వెంకన్న అన్నారు. రంగా హత్య కేసు నిందితులను వెంటేసుకుని కేశినేని నాని తిరుగుతున్నారని, వారితో కలిసి ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.  వచ్చే లోకసభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. కేశినేని నాని రెండు కాళ్లు కూడా విరగ్గొడుతానని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో నాగుల్ మీరా కూడా పాల్గొన్నారు.

click me!