ఆ వైసిపి ఎమ్మెల్యేలే ప్రజలకు కరోనాను అంటిస్తున్నారు: బోండా ఉమ ఆరోపణ

By Arun Kumar PFirst Published Apr 21, 2020, 9:13 PM IST
Highlights

కరోనా నుండి ప్రజలను కాపాడాల్సింది పోయి వైసిపి ఎమ్మెల్యేలే కరోనాను అంటిస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 

గుంటూరు: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనాను కూడా కమీషన్లతో ముంచెత్తిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. దేశంలో కరోనాతో కూడా కమిషన్లు కొట్టేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని... కేంద్రం ఇచ్చిన రూ.వెయ్యి సాయాన్ని పూర్తిగా ప్రజలకు పంచకుండా కొట్టేశారని ఆరోపించారు.  

పేదవారికి రెండు విడతలుగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని కేంద్రం పంపించింది తప్పితే రాష్ట్రం ఏ కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఆఖరికి పుచ్చిపోయిన శనగలు ఇచ్చి కందిపప్పు ఇచ్చినట్లుగా బిల్లులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

సౌత్ కొరియా నుంచి ఇతర రాష్ట్రాలు రూ.300లకే టెస్టింగ్ కిట్లు కొంటే ఏపీలో మాత్రం రూ.800 కు కొన్నట్లు చూపించి కోట్ల రూపాయల అవినీతికి వైసిపి సర్కార్   పాల్పడిందని అన్నారు. పేదవారు పస్తులతో పడుకుంటుంటే జగన్ మాత్రం తాడేపల్లిలో కూర్చొని నోట్లకట్టలు లెక్కబెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

''పొరుగు రాష్ట్రాల్లో కరోనాపై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి తక్కువ నష్టంతో బయటపడ్డారు. ఏపీలో మాత్రం మొదటినుంచి పారాసెట్మాల్ అంటూ చులకనగా చూసి జగన్ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారకులయ్యారు. నెల్లూరులో ప్రసన్నకుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా మీటింగ్ లు పెట్టి ప్రజలకు కరోనా అంటేలా చేశారు''అని ఆరోపించారు. 

''దేశంలో కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 11వ స్థానంలో ఉందంటే కారణం వైసీపీ నేతలే. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వల్ల రెవెన్యూ ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చేందుకు కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గుంపులు గుంపులుగా వస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్యే బావమరిది నిర్వాకం వల్ల అనేకమందికి కరోనా వచ్చింది'' అని అన్నారు.  

''పేదలను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా జగన్ ఖర్చుపెట్టలేదు. అన్నింటిలో కమీషన్లు కొట్టేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. 16 కోట్ల మాస్క్ ల తయారీలో కూడా పెద్దఎత్తున అవినీతి ఉంది'' అని ఆరోపించారు. 

''అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు గారు అప్రమత్తం చేస్తుంటే.. విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతల మాదిరిగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాలా? కరోనా లెక్కలను కూడా సరిగా చెప్పడం లేదు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది'' అని బోండా ఉమామహేశ్వర రావు సూచించారు.  

click me!