
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం.. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రయాణికులతో వెళుతున్న ఈ పడవ బోల్తా ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద ఘటన విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగి గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా గల్లంతైన యువకుల కోసం వెతుకుతున్నారు. ఆదివారంసెలవు రోజు కావడంతో వీరంతా సరదాగా చెరువులో షికారుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో పదిమంది యువకులు ఉన్నారు. వీరిలో ఆరుగురు గల్లంతు కాగా, నలుగురు క్షేమంగా బయటపడ్డారు. పడవ మునకలో గల్లంతైన యువకుల పేర్లు రఘు(24), సురేంద్ర (19), బాలాజీ(21), కళ్యాణ్ (28), త్రినాథ్ (18), ప్రశాంత్(29)గా పోలీసులు తెలిపారు. ఈ ఆరుగురు యువకుల కోసం గాలింపు చర్యలు పొదలకూరు సిఐ సంగమేశ్వర రావు, ఎస్సై ఖరీముల్లా పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
కాగా, వీరిలో కల్యాణ్, త్రినాథ్ ల మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. వీరి మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన మీద మంత్రి కాకాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటన గురించిన సమాచారం తెలియగానే కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు మంత్రి. సోమవారం అర్ధరాత్రికి మంత్రి కాకాని తోడేరుకు చేరుకోనున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. గల్లంతైన వారికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ పి వీరాంజనేయ రెడ్డి మాట్లాడుతూ వీరంతా తోడేరు సమీపంలోని శాంతి నగర్ గ్రామానికి చెందినవారని తెలిపారు. వీరు చెరువులో చేపలకు మేత వేసేందుకు ఉపయోగించే పడవలో చెరువులోకి వెళ్లారు. అయితే, పడవ ఓవర్‌లోడ్ అయి, వారు దానిపై నియంత్రణ కోల్పోయారు.
ఇటలీలో నౌక ప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా, 59 మంది మృతి
పడవలోకి నీరు రావడంతో మునిగిపోతామని భయపడి.. ఈదుకుంటూనైనా ఒడ్డుకు చేరుకుందామనే ఆశతో పడవలో నుంచి నీళ్లలోకి దూకారు. అయితే, 10 మందిలో నలుగురు మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు రాగలిగారు. మిగిలిన ఆరుగురు ఇప్పటికీ చెరువులో తప్పిపోయారు. ఈ ప్రమాదంపై స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బందితో కూడిన రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ టీంలు చెరువు వద్దకు చేరుకునే సమయానికి ఇనుముతో చేసిన బోటు పూర్తిగా చెరువులో మునిగిపోయింది.గల్లంతైన వారి ఆచూకీ కోసం సమీప ప్రాంతాల నుంచి పడవలను తోడేరుకు రప్పించారు. వెలుతురు సరిగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆశించిన స్థాయిలో సాగలేదు.
ఇదిలా ఉండగా, ఆదివారం ఇటలీ ప్రధాన భూభాగం దక్షిణ తీరానికి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఘోరమైన పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అయోనియన్ సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలియడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 59 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన కాలాబ్రియాలోని తీర ప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో చోటుచేసుకుంది.