బోటు మునక: గోదావరిలో కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

By narsimha lodeFirst Published Oct 22, 2019, 7:59 AM IST
Highlights

గోదావరి నదిలో ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు రాయల్ వశిష్ట బోటు వెలికితీసే ప్రక్రియలో బోటు పైకప్పు భాగాలు బయటకు వచ్చాయి.

దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది. సోమవారం నాడు రాయల్ వశిష్ట బోటు వెలికితీసే ప్రక్రియలో బోటు పై భాగం ముక్కలు బయటకు వచ్చాయి.

గోదావరి నదిలో ఇసుక పేరుకుపోవడంతో కూడ బోటు వెలికితీతకు కొంత ఇబ్బందులు చోటు చేసుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో బోటు పైకప్పు భాగాలు బయటకు వచ్చాయి.


రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు.

దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు.  

ఇలా 6 సార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ విలేకర్లకు తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే, వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు. 

మంగళవారం నాడు ఉదయం నుండే బోటును వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బోటుకు ఇనుప రోప్ వేసి ప్రొక్లెయినర్ సహాయంతో బయటకు లాగనున్నారు. సోమవారం నాడు బోటు కొన్ని అడుగుల దూరం జరిగింది. ప్రొక్లెయినర్ తో లాగే క్రమంలో బోటు పైకప్పు విడిభాగాలు మాత్రమే బయటకు వచ్చాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన పాపికొండల పర్యటనకు వెళ్తున్నబోటు మునిగిపోయింది. ఈ బోటు ప్రమాదంలో సుమారు 15 మంది ఆచూకీ గల్లంతైంది. రెండు రోజుల క్రితం ఒక మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించారు. ఈ మృతదేహానికి తల లేదు. ఈ మృతదేహం ఎవరిదనే విషయాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆచూకీ గల్లంతైన వారంతా బోటులోనే చిక్కుకొని ఉంటారని విశ్వసిస్తున్నారు.

గల్లంతైన వారంతా మృతి చెందారని భావించి ఆయా కుటుంబసబ్యులకు డెత్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

 

 

click me!