ఇంఛార్జ్ మంత్రుల మార్పు: వ్యూహమా...? డిమోషనా..?, జగన్ వ్యవహారశైలిపై చర్చ

By Nagaraju penumalaFirst Published Oct 21, 2019, 5:39 PM IST
Highlights

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నానిలను జాబితాల నుంచి తొలగించడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారా..? లేక కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో వారికి ఇతర బాధ్యతలు అప్పగించకూడదన్న నిర్ణయంతో తప్పించారా అన్న చర్చ జరుగుతుంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా...? పాలనపై పట్టుసాధించడంతోపాటు పార్టీ కార్యకలాపాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా...? 

మంత్రుల పనితీరుపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయని సీఎం జగన్ నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారా...? నాలుగు నెలల వ్యవధిలోనే ఇంఛార్జ్ మంత్రులను మార్చడంలో మతలబు ఏంటి...? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. మంత్రి పదవి రెండున్నరేళ్లేనంటూ చెప్పుకొచ్చారు. పనితీరును బట్టి వారి పదవీకాలం ఉంటుంది లేకపోతే హుష్ కాకీ అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ హెచ్చరికలు ఇప్పటికీ వైసీపీ మంత్రులను కలవరపాటుకు గురిచేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగునెలల క్రితం నియమించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రులను ఒకేసారి తొలగించేశారు. 

కనీసం ఏడాదిపాటు కూడా ఇంఛార్జ్ మంత్రులు పనిచేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో నియమించిన మంత్రుల్లో కొందరికి ప్లేస్ కన్ఫమ్ అయ్యింది కానీ కీలక నేతలను మాత్రం తప్పించారు. 

వాస్తవానికి జులై 4న 13 జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమించారు సీఎం జగన్. అయితే ఆకస్మాత్తుగా ఆదివారం ఇంఛార్జ్ మంత్రుల జాబితాను రద్దు చేశారు. చిత్తూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మినహా మిగిలిన జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను మార్చేసి సరికొత్త అనుమానాలకు తెరలేపారు సీఎం జగన్. 

ఇకపోతే ఈసారి ఒక్క డిప్యూటీ సీఎంను కూడా ఇంఛార్జ్ మంత్రిగా నియమించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత రెండో పదవి హోంశాఖ. అలాంటిది హోంశాఖ మంత్రికి కూడా ఇంఛార్జ్ పదవి కట్టబెట్టలేదు. ఉన్న పదవిని తొలగించారు. 

జూలై 4న ప్రభుత్వం ప్రకటించిన ఇంఛార్జ్ మంత్రుల్లో మేకతోటి సుచరిత స్థానం దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈసారి ఆమెను ఆ జాబితా నుంచి తొలగించారు. ఆమె స్థానంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.  

ఇకపోతే సీఎం జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి దేశ రాజకీయాల్లోనే సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించారు. 

ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఇద్దరిని ఇంఛార్జ్ మంత్రులుగా నియమించారు సీఎం జగన్. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ గా, మరో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జ్ గా నియమించారు. 

అయితే ఈసారి జాబితాలో వారిద్దరిని తొలగించారు. ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మెుండి చేయి చూపారు. వీరి స్థానంలో కొత్తగా మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ లకు అవకాశం కల్పించారు.  

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నానిలను జాబితాల నుంచి తొలగించడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారా..? లేక కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో వారికి ఇతర బాధ్యతలు అప్పగించకూడదన్న నిర్ణయంతో తప్పించారా అన్న చర్చ జరుగుతుంది. 

అయితే వైసీపీలో మాత్రం ఈ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇంఛార్జ్ మంత్రులుగా ఉన్న మంత్రులుగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికి తెలియజేస్తామని అందేలా చూస్తామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ లో ఇంచార్జి మంత్రుల మార్పు, జాబితా ఇదే

click me!