Rajamahendravaram: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అసలైన సూత్రధారి అని సీఐడీ పేర్కొంది. ఈ క్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి కొందరు ప్రయివేటు వ్యక్తులు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డబ్బుల జాడ స్పష్టంగా కనిపిస్తోందని సీఐడీ అదనపు డీజీ అన్నారు. అయితే, చంద్రబాబు అరెస్టులో జగన్ ఒక్కరే కుట్రదారు అని మాజీ మంత్రి యనమల ఆరోపించారు.
Former Minister Yanamala Ramakrishnudu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అసలైన సూత్రధారి అని సీఐడీ పేర్కొంటుండగా, రాజకీయ కక్షతోనే వైకాపా ప్రభుత్వం ఇలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవడంతో ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ తీరును, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు చేపట్టింది. ఇదే క్రమంలో చంద్రబాబు అరెస్టులో బీజేపీ ప్రమేయం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ కుట్ర చేసిందనే ఒక వర్గం చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే కుట్రదారుడని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను అణచివేసే రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు అరెస్టు చేశారన్నారు.
తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో ద్వారా లక్ష కోట్లు దోచుకున్న జగన్ మోహన్ రెడ్డి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. సీఎం అయ్యాక జగన్ ఈ నాలుగేళ్లలో రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణగదొక్కడం, దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవొచ్చని జగన్ భ్రమ పడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రపంచవ్యాప్తంగా జగన్ పై వ్యతిరేకత వెల్లువెత్తిందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయడమే జగన్ ఎజెండా అని మండిపడ్డారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.