కీలక పదవులు ఇచ్చేందుకు రెడీ: చిరంజీవికి బిజెపి గాలం

By Nagaraju penumalaFirst Published Jun 25, 2019, 5:56 PM IST
Highlights

సినీనటుడుగా విశేష ఆదరణ కలిగిన చిరంజీవి కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత. ఉభయగోదావరి జిల్లాలతోపాటు మెుత్తం 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు గెలుపును నిర్దేశిస్తారు. ఈనేపథ్యంలో కాపు ఓటర్లను ఆకర్షించాలి అంటే చిరంజీవి లాంటి ప్రజాకర్షణ కలిగిన నేతలను పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో జోరుపెంచింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ జనాకర్షణ కలిగిన సినీనటులపై దృష్టిసారించింది. 

ఏపీలో బీజేపీ పాగా వేయాలన్న ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తోంది. తెలుగుదేశం పార్టీ బలాన్ని తమవైపుకు తిప్పుకునేందుకు కార్యచరణ అమలు చేస్తోంది. అలాగే వివిధ సామాజిక వర్గాల్లో మంచి పట్టున్న నాయకులను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహారచన చేస్తోంది కాషాయిదళం.  

తెలుగుదేశం పార్టీలో కీలక నేతలైన 
సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, అంబికాకృష్ణలను పార్టీలో చేర్చుకుంది బీజేపీ. మరికొంతమందిని చేర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. 

తెలుగుదేశం పార్టీలో కీలక నేతలను లాగేసిన బీజేపీ తాజాగా ప్రజాదరణ కలిగిన నాయకులపై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రమాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ కలిగిన నటుడు. అంతేకాదు ఏపీలో బలమైన సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గాన్ని సైతం ప్రభావితం చేయగల నాయకుడు. ఈ పరిణామాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందని బీజేపీ ప్రయత్నిస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి గత సార్వత్రిక ఎన్నికల్లో మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గానీ అటు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున గానీ ఎలాంటి ప్రచారం చేయలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు చిరు. 

ఖైదీ నంబర్ 150 సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరు సైరా చిత్ర షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రాజకీయాలను అంతగా పట్టించుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. 

ఇకపోతే చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా గత ఏడాది ఏప్రిల్ నెలలో ముగిసింది. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత ఒక్కసారి కూడా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అసలు రాజకీయ తెరపై కనిపించనే లేదు. 

రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో ఆయన జనసేన పార్టీలో చేరి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తారని భావించారు కానీ అలా జరగలేదు. ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న చిరంజీవిని బీజేపీలోకి తీసుకువస్తే బాగుంటుందని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

సినీనటుడుగా విశేష ఆదరణ కలిగిన చిరంజీవి కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత. ఉభయగోదావరి జిల్లాలతోపాటు మెుత్తం 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు గెలుపును నిర్దేశిస్తారు. ఈనేపథ్యంలో కాపు ఓటర్లను ఆకర్షించాలి అంటే చిరంజీవి లాంటి ప్రజాకర్షణ కలిగిన నేతలను పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. 

మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణలు భేటీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పార్టీలోకి చేరితే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు కీలక పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఏపీలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ బలోపేతంపై వ్యూహరచన చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి రాజకీయాల జోలికి వెళ్లరని చెప్పారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని స్పష్టం చేశారు.

అయితే తాజాగా బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చిరంజీవిపై ఫోకస్ పెట్టడంతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న ఆసక్తికర చర్చ  జరుగుతోంది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేక సినిమాలపైనే దృష్టిపెడతారా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మరి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.  

click me!