వైసీపీ వల్ల మేలు కంటే కీడే ఎక్కువ : బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jul 24, 2019, 4:49 PM IST
Highlights

ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భుజంతో భుజం కలిసి పనిచేసే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో 25 ఏళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారన్నారు. 

కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో భయాందోళన నెలకొందని విమర్శించారు.  

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాంమాధవ్ ఆదిలోనే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పుకొచ్చారు. 

గత ఐదేళ్లు ఒక ప్రాంతీయ పార్టీని గెలిపించారని ఆ పార్టీవల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రెండో ప్రాంతీయ పార్టీని ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిపించి అధికారం కట్టబెట్టారని చెప్పుకొచ్చారు. రెండో ప్రాంతీయ పార్టీ మేలు చేస్తుందని ప్రజలు అధికారాన్ని అప్పగించారని చెప్పుకొచ్చారు. 

అధికార పార్టీ తప్పటడుగుల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్న భయం ప్రజల్లో కనపడుతోందని రాంమాధవ్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ ప్రజల పరిస్థితి చూస్తుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉందని విమర్శించారు. రాష్ట్రాలు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. 

ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భుజంతో భుజం కలిసి పనిచేసే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో 25 ఏళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారన్నారు. 

2024 ఎన్నికల్లో బీజేపీయే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని కోరారు. బీజేపీని బలోపేతం చేస్తే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండటం లేదన్నారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించాలని రామ్ మాధవ్ కోరారు. 

click me!