
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై సీబీఐ విచారణ జరిపించాలని వారు కేంద్రాన్ని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీలు సీఎం రమేష్ , జీవీఎల్ నరసింహారావులు ఇవాళ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివక్షతతో వ్యవహారిస్తోందని ఆయన ఎంపీ జీవీల్ నరసింహారావు ఆరోపించారు. టీడీపీ హాయంలో కూడ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై వివక్షను చూపారని ఆయన విమర్శించారు.
also read:దేవాలయాల్లో వరుస ఘటనలు: సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్
చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు కూడ జరిగాయని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ లో అణచివేతకు గురౌతున్న హిందూవులు భారత్ ను శరణు కోరుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీలో హిందూవులు ఎవరి శరణు కోరాలని ఆయన ప్రశ్నించారు.
తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారంతోనే ప్రభుత్వ వైఖరి బయటపడిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు.ఎవరో మేసేజ్ ఫార్వర్డ్ చేశారని అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు. నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉందన్నారు. ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.