
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టనిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు. జనసేన త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్దంగా లేదని.. కచ్చితంగా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికలై రిజల్ట్స్ వచ్చినప్పుడు మాట్లాడతామని చెప్పారు. దీంతో పవన్ ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ స్పందించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. తాము ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేశారని అన్నారు.
మరో పార్టీని(టీడీపీని) కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్ తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చకూడదనే అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అధిష్టానంతో మాట్లాడుతున్నారని చెప్పారు. పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనని చెప్పారు. జనసేన, బీజేపీ ఎన్నికల్లో కలిసి వెళతామని మాత్రం తాము స్పష్టం చేయగలమని అన్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ ప్రకటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ.. పొత్తులపై పవన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తమ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు.