హిందువుల మనోభావాలతో వైసిపి, టిడిపి రాజకీయాలు..: ఎమ్మెల్సీ మాధవ్ ఆగ్రహం

By Arun Kumar PFirst Published Jan 3, 2021, 12:15 PM IST
Highlights

ఇటీవల రామతీర్థం దేవాలయంలో మూల విరాట్ శిరస్సును చేధించడం అత్యంత దారుణమని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు.

అమరావతి: రామతీర్థం అంశాన్ని రాజకీయం చేయాలని‌ వైసిపి, టిడిపి ప్రయత్నం చేస్తున్నాయని బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. అందువల్లే రామతీర్థం ఘటనపై ఈనెల 5 వ తేదీన బిజెపి, జనసేన సంయుక్తంగా ఛలో రామతీర్థం చేపడుతున్నామని... ప్రజలు, రామ‌ భక్తులు అందరూ పాల్గొనాలని మాధవ్ కోరారు. ఈ యాత్రలో ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు బిజెపి, జనసేన ముఖ్య నాయకులు పాల్గొంటారని అన్నారు.

''రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల‌పై దాడులు పెరిగిపోయాయి. ఇటీవల రామతీర్థం దేవాలయంలో మూల విరాట్ శిరస్సును చేధించడం అత్యంత దారుణం. పురాతన, పవిత్రమైన ఆలయంలోనే జరగడం పరాకాష్టకు నిదర్శనం. ఆంధ్రా భద్రాద్రి రామతీర్థంలో ఇటువంటి ఘటన జరగడం‌ చాలా బాధాకరం'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

''పవిత్ర హిందూ దేవాలయం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో‌ విఫలైంది. వెంటనే పట్టుకుని శిక్షించాలి'' అని మాధవ్ డిమాండ్ చేశారు.

read more నువ్వెంత నీ బ్రతుకెంత.. నాలుక కోస్తాం: వెల్లంపల్లికి టిడిపి ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇదిలావుంటే ఇవాళ కూడా రామతీర్ధంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ(ఆదివారం) హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ''చలో రామతీర్థం'' జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ సంఘాల ప్రతినిధులు రామతీర్థంకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావణం నెలకొంది. 

ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో గత ఐదు రోజులుగా నిరసన చేస్తున్న బీజేపీ శిబిరాన్ని శనివారం రాత్రి పోలీసులు తొలిగించారు. దీంతో బిజెపి నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తల చోటుచేసుకుంది. 

ఇక మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ రేపు(సోమవారం) రామతీర్థంను సందర్శించనున్నారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత బొత్స, వెల్లంపల్లి ఆలయం వద్దకు చేరుకునున్నారు. ఇక ఇప్పటికే రామతీర్థం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

 


 

click me!