మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి వంటివారికి కాదని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్ కి కీలక మంత్రి పదవి దక్కింది. ఇంతకూ ఎవరీయన..?
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయంతో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఈ కూటమి ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. ఇలా టిడిపి, జనసేన పార్టీలకు చెందినవారితో చంద్రబాబు కేబినెట్ నిండిపోయింది. అయితే బిజెపికి కేవలం ఒకే ఒక మంత్రి పదవి దక్కింది... అతడు ఎవరో కాదు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్.
ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఏకంగా 164 సీట్లు సాధించింది. ఇందులో టిడిపి 135, జనసేన 21, బిజెపి 8 మంది ఎమ్మెల్యేలు వున్నారు. వీరిలో టిడిపి, జనసేన నుండి కాస్త అటుఇటుగా ఊహించినవారికే మంత్రిపదవులు దక్కాయి. కానీ బిజెపిలో మాత్రం ఎవరూ ఊహించని సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయనను కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దక్కింది.
undefined
బిజెపి నుండి గెలిచిన 8మంది ఎమ్మెల్యేలలో సత్యకుమార్ యాదవ్ రాజకీయాల్లోనే చాలా జూనియర్ అని చెప్పాలి. గతంలోనే మంత్రులుగా చేసిన కామినేని శ్రీనివాస్, సిహెచ్ ఆదినారాయణరెడ్డి వంటివారు... కేంద్ర మంత్రిగా చేసిన సుజనా చౌదరి... గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వంటివారిని కాదని మొదటిసారి ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. దీంతో అసలు ఎవరీయన? బిజెపి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చింది..? అతడి రాజకీయ ప్రస్థానం ఏమిటి..? వ్యక్తిగత వివరాలేమిటి? తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఎవరీ సత్యకుమార్ యాదవ్ :
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో సత్యకుమార్ యాదవ్ జన్మించారు. ఆయన పాఠశాల విద్య కడప జిల్లా ప్రొద్దుటూరు, తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో సాగింది. ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ పూర్తిచేసారు. ఆ తర్వాత మధురై మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, చెన్నైలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు.
సామాన్య మద్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సత్యకుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయ నాయకుడిగా మారాడు. అతడిలోని బహుబాషా ప్రావిణ్యమే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. అతడు మాతృబాష తెలుగుతో పాటు జాతీయ బాష హిందీ స్పష్టంగా మాట్లాడగలరు. అలాగే ఇంగ్లీష్, మరాఠీ బాషలపై పట్టుంది. ఈ లక్షణాలే సత్యకుమార్ ను మాజీ ఉపరాష్ట్రపతి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడికి దగ్గర చేసింది. 1993 లో వెంకయ్యనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరడం సత్యకుమార్ జీవితాన్ని మలుపుతిప్పింది.
వెంకయ్యనాయుడుతోనే 25ఏళ్ళ ప్రయాణం :
తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడు వెంకయ్యనాయుడు. పార్టీ పదవులతో పాటు ఎన్డిఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు వెంకయ్య. చివర్లో ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసి యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. అయితే వెంకయ్యనాయుడు రాజకీయంగా యాక్టివ్ గా వున్న సమయంనుండి రాజకీయాలకు దూరం జరిగేవరకు వెన్నంటే వున్నాడు సత్యకుమార్ యాదవ్. ఇలా ఏకంగా 25 ఏళ్లపాటు వెంకయ్య వెంటే వున్నాడు.
వెంకయ్య నాయుడు వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో సత్యకుమార్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడిగా, ప్రైవేట్ కార్యదర్శిగా, అదనపు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసారు. కేంద్ర మంత్రిగా కొనసాగిన వెంకయ్య కొనసాగిన సమయంలో సత్యకుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలోనే అతడికి బిజెపి ముఖ్య నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పనిచేసిన సమయంలో సత్యకుమార్ ఓఎస్డీగా పనిచేసారు.
పొలిటికల్ ఎంట్రీ :
వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరం కావడంతో సత్యకుమార్ యాదవ్ రాజకీయాల వైపు అడుగేసారు. వెంకయ్య నాయుడు వద్ద పనిచేసిన కాలంలో ఏర్పడిన పరిచయాలతో ఆయన బిజెపిలో చేరాడు. వెంకయ్యనాయుడు సపోర్ట్, బిజెపి పెద్దల అండదండలు సత్యకుమార్ కు లభించాయి. దీంతో జాతీయ స్థాయిలో పార్టీ పదవులు పొందిన ఆయన మంత్రి స్థాయికి ఎదిగారు.
2018 లో మొదటిసారి బిజెపి జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు. కేరళ,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరిశీలకుడిగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సహ ఇంచార్జీగా, అండమాన్ నికోబార్ ఇంచార్జీగా పనిచేసారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం :
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ సత్యకుమార్ కు దక్కింది. స్థానికంగా టిడిపి నుండి పరిటాల శ్రీరామ్, బిజెపి నుండి గోనుగుండ్ల సూర్యనారాయణ ఈ సీటును ఆశించినా చివరకు ఆ అవకాశం సత్యకుమార్ కు దక్కింది. పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బిజెపికి దక్కడం... బిజెపి పెద్దలతో పరిచయాలు సత్యకుమార్ కు కలిసివచ్చాయి.
ధర్మవరం బరిలో నిలిచిన సత్యకుమార్ గెలుపును ఎవరూ ఊహించలేదు. వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రజల్లో మంచి పాపులారిటీ వుండటంతో ఈసారి కూడా ఆయనే గెలుస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 3,734 ఓట్ల తేడాతో బిజెపి నేత సత్యకుమార్ యాదవ్ గెలిచారు. ఇలా మొదటిసారి ఎమ్మెల్యే కావడమే కాదు ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఇలా సత్యకుమార్ యాదవ్ వైద్యారోగ్య శాఖ మత్రిగా మారారు.