టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాతి స్థానం పవన్ కల్యాణ్ దే. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు కాబట్టి హోంమంత్రి పవన్ కల్యాణ్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ పవన్ మాత్రం హోంశాఖను కాదని గ్రామీణాభివృద్ది శాాఖను ఎరికోరి తీసుకున్నారట... ఎందుకో తెలుసా..?
అమరావతి : కొణిదల పవన్ కల్యాణ్ ... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్న పేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటివారు సైతం పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్, జనసైనికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోటీచేసిన అన్నిస్థానాల్లో 100 శాతం విన్నింగ్ రేట్ తో చరిత్ర సృష్టించిన పవన్ కింగ్ మేకర్ గా మారారు. దీంతో పాలనలోనూ పవన్ పాత్ర కీలకంగా మారింది.
టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటు, చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి పవన్ కల్యాణ్ వల్లే సాధ్యమయ్యిందని రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య ప్రజల అభిప్రాయం. దీంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తర్వాతి స్థానం పవన్ కల్యాణ్ దే... అందుకు తగినట్లుగానే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అయితే ఆయనకు హోంశాఖ దక్కుతుందని అనుకుంటే పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది, అటవీ-పర్యావరణ శాఖలు దక్కాయి. హోంశాఖ పవన్ కు దక్కకపోవడం మెగా ఫ్యాన్స్, జనసైనికులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. కానీ ఇప్పుడు కేటాయించిన శాఖలు పవన్ ఏరికోరి తీసుకున్నారట... దీంతో తాము కోరింది జరగకున్నా బాస్ అనుకున్నది జరగడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
పవన్ కు పంచాయితీరాజ్ & గ్రామీణాభివృద్ది శాఖలే ఎందుకు..?
పవన్ కల్యాణ్ వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. రాజకీయాల్లో అడుగుపెట్టేకంటే ముందు టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనూ వ్యవసాయం గురించి మాట్లాడేవారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి స్వయంగా వ్యవసాయం కూడా చేస్తున్నారు పవన్. షూటింగ్ లు లేనప్పుడు ఆ ఫార్మ్ హౌస్ లోనే గడిపేవారు... ఇలా అతి సామాన్యుడిలా వ్యవసాయ పనులు చేస్తున్న పవన్ ఫోటోలు బయటకు కూడా వచ్చాయి.
ఇక రాజకీయాల్లోకి వచ్చాక పవన్ రైతులకు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కౌలు రైతుల భరోసా యాత్ర కూడా చేపట్టారు... ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఆర్థిక సాయం చేసారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందక, సాగునీరు లేక... ఇలా వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలకు తాను అండగా నిలవడమే కాదు ఆనాటి జగన్ ప్రభుత్వంతో ఆర్థికసాయం చేయించేందుకు ప్రయత్నించారు పవన్. ఇలా రైతుల కోసం పవన్ సాగించిన ప్రయాణమే ఇప్పుడు కీలకమైన హోంశాఖను కాదని గ్రామీణాభివృద్ది & పంచాయితీరాజ్ శాఖలను తీసుకునేలా చేసిందని ఆయన సన్నిహితులు, జనసేన నాయకులు చెబుతున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలోనూ పవన్ కల్యాణ్ ఎక్కువగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మరియు రైతుల కష్టాలు, గ్రామీణ వ్యవస్థ గురించి మాట్లాడారు. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి దారుణంగా వుందని... అభివృద్దికి నోచుకోవడం లేదని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి రాగానే గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని... పంచాయితీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు.
అయితే గ్రామీణ వ్యవస్థ గురించే కాదు పర్యావరణం గురించి కూడా పవన్ కు మంచి అవగాహన వుంది. అందువల్లే ఆయన ఎరికోరి పంచాయితీరాజ్ & గ్రామీణాభివృద్ది, అటవీ పర్యావరణ శాఖలు తీసుకున్నట్లు సమాచారం. వీటికి అదనంగా శాస్త్ర సాంకేతిక శాఖలను కూడా ఆయనకే కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు.