రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలని బీజేపీ నేతల బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆయన కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు.
కర్నూల్: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని BJP నేత Byreddy Rajashekar Reddy డిమాండ్ చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు పెద్దవిగా ఉన్నాయన్నారు. ఈ జిల్లాలను 14 జిల్లాలుగా విభజించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు ఆయన కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు.
దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే Rayalaseema వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.కడప, చిత్తూరు జిల్లాలను మూడు జిల్లాల చొప్పున ఆరు జిల్లాలుగా విభజించాలని కోరారు. ఆదోనీని జిల్లా చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. అటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కూడా జిల్లాగా చేయాలన్నారు.
ప్రజల వద్దకే పాలన ఉండాలని నాటి సీఎం ఎన్టీఆర్ పరిపాలన సాగించారన్నారు. మండల కార్యాలయాలను ఏర్పాటు చేశారన్నారు. తహసీల్దార్ల స్థానంలో ఎమ్మార్వో లుగా అని ఎన్టీఆర్ పెడితే వైఎస్ఆ రాజశేఖర్ రెడ్డి వచ్చి తహసీల్దార్ అని పేరు మార్చారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన తెస్తే జగన్ ప్రజలకు దూరంగా పాలన సాగిస్తున్నాడని ఆయన విమర్శించారు. జగన్ తుగ్లకా జగ్లకా అనేది తనకు అర్థం కావడం లేదన్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, డోన్ కేంద్రాలుగా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గత నెల 26 వ తేదీన కొత్త జిల్లాలను ఏర్పాటుకు కోరుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొత్త జిల్లాలపై ప్రజల నుండి సూచనలు, సలహాలను అభిప్రాయాలు కోరింది ప్రభుత్వం. ఈ నెల 26వ తేదీ వరకు ప్రజల నుండి వచ్చిన సూచనలు,సలహాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త జిల్లాల విషయంలో అవసరమైన మార్పులు చేర్పులు చేయనుంది.