కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ భేష్.. జగన్ ప్రభుత్వంపై బిజెపి-జనసేన ఫైర్

By Arun Kumar PFirst Published May 6, 2020, 10:58 AM IST
Highlights

బిజెపి జనసేన పార్టీ నాయకుల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 

గుంటూరు: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించి ప్రాణాలు హరిస్తూ మానవాళిని భయకంపితుల్ని చేస్తున్న ప్రమాద పరిస్థితుల్లో భారతీయులు తమ ప్రాణాలనుపణంగా పెట్టి సేవలు అందించారని... దీంతో వారిపట్ల ప్రపంచ దేశాల ప్రజలకు గౌరవభావం మరింత పెరిగిందని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితులపై చర్చించేందుకు బీజేపీ, జనసేన పార్టీల అగ్రనేతల మధ్య వీడియో సమావేశం జరిగింది. 

ఈ వీడియో సమావేశంలో బీజేపీ జాతీయ స్థాయి నాయకులు సతీష్ జీ,  సునీల్ దేవధర్, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు  జివిఎల్.నరసింహారావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఇరు పార్టీల మధ్య సాగిన చర్చల వివరాలను సంయుక్తంగా  వెల్లడించారు. 

ఈ చర్చల ముఖ్య వివరాలు...

''ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న కరోనా నియంత్రణలో తీసుకున్న నిర్ణయాలు ఈ గౌరవాన్ని మరింత పెంచినట్లు సమావేశం అభిప్రాయపడింది. మన దేశంలో మాత్రమే అత్యధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును అడిగిన దేశాలు అన్నిటికీ అందించి దాతృత్వాన్ని చాటుకోవడంతో మన దేశాన్ని కొనియాడని దేశం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. భారత్ లో కరోనా  ఆనవాళ్లు కనిపించిన వెంటనే లాక్ డౌన్ విధించి కరోనా వ్యాప్తి విస్తృతం కాకుండా చూడడం, లాక్ డౌన్ ను సమర్ధంగా అమలుచేయడం వంటి చర్యలు ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట పెంచినట్లు సమావేశంలోని ఇరు పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వివిధ ప్రాంతాలకు చదువుల నిమిత్తం వెళ్ళిన విద్యార్థులను, ఉపాధి కోసం వెళ్ళిన కార్మికులను, పుణ్య క్షేత్రాలకు వెళ్ళిన భక్తులను, పర్యాటకులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయం. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశాయి.

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన వెంటనే ప్రజలంతా సంఘటితమై లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేసి మన దేశ సమైక్యతను చాటారని సమావేశం కొనియాడింది. ఆంధ్రప్రదేశ్ లోని 670 మండలాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు, ఆహార పొట్లాలు అందించి ఎనలేని సేవలు చేస్తున్నారని శ్లాఘించింది. ఆపన్నులను ఆదుకునే ఇటువంటి సేవా కార్యక్రమాలను ఇక ముందు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చింది. 

కరోనా నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విధానాలు, చర్యలపై సమావేశం విశ్లేషించింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తీరుపై సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కరోనాను కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఇరుపార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. 

కరోనాతో కొన్నాళ్లు సహజీవనం చేయవలసిందే అని రాజకీయ నాయకత్వానికి బాధ్యత వహిస్తున్నవారు మాట్లాడిన తరువాత భయాందోళనలు మరింత పెరిగాయని... ప్రజలను అప్రమత్తం చేయడంలో తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేకపోయిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్న విషయం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. 

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గట్టి భరోసా ఇవ్వవలసిందిపోయి భయాలు పెరిగే మాటలు మాట్లాడరాదని సూచించింది. ఈ విపత్కర సమయంలో రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు బాధ్యతలు విస్మరించి ర్యాలీలు నిర్వహించడం, బహిరంగ కార్యక్రమాలు చేపట్టడం ఆక్షేపణీయంగా ఉన్నాయని, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలే వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయని సమావేశం అభిప్రాయపడింది.

ఈ లాక్ డౌన్ కాలంలో పేదలు, అల్పాదాయ వర్గాల వారి సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని, ఏ ఒక్కరూ ఆకలితో మరణించకుండా చర్యలు చేపట్టాలని సమావేశం కోరింది. కరోనా నిర్మూలనకు జనసేనలోని డాక్టర్లు సంపూర్ణంగా ప్రభుత్వానికి సహకరించాలని, అవసరం అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా సేవలు అందించాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదే విధంగా సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన జనసేన, బి.జె.పి. కార్యకర్తలు మాస్కులు, గ్లౌజెస్, శానిటైజర్లు ఉపయోగించాలని, తగిన జాగ్రత్తలతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సమావేశం సూచించింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భయాందోళనలు లేని సంపూర్ణ ఆరోగ్యం అందించవలసిన బాధ్యత వై.సి.పి. ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు, అల్పాదాయ కార్మికులకు బీజేపీ, జనసేన శ్రేణులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఇరు పార్టీల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశంసనీయరీతిలో ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఇరు పార్టీల శ్రేణులకు నేతలు అభినందనలు తెలిపారు.
 

click me!