మద్యం అమ్మకాలను ఆపకుంటే కరోనా విజృంభిస్తుంది : జగన్ సర్కార్ కి జూనియర్ డాక్టర్ల లేఖ

By Sree sFirst Published May 6, 2020, 9:24 AM IST
Highlights

మద్యం కోసం క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల తాము ఇన్ని రోజులుగా కరోనా వైరస్ పై పోరులో తీసుకున్న చర్యలు, తమ పోరాటం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానికి ఒక లేఖ రాసారు. 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మే 17 వరకు మూడవదఫా లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడవదఫా లాక్ డౌన్ లో కేంద్రం భారీస్థాయిలో సడలింపులు ఇచ్చిందనే చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మద్యం షాపులను తెరవడానికి కేంద్రం అనుమతులిచ్చింది. 

ఇలా మద్యం షాపులను తెరవడానికి అనుమతులివ్వడంతో ఒక్కసారిగా మద్యం షాపుల వద్ద చాంతాడంత క్యూ లైన్లను మనం చూసాము. భౌతిక దూరం పాటించడం అనే విషయమే మందుబాబులకు పట్టడం లేదు. ఆ క్యూ లైన్లను పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమిటో మనం చూసాము. జగన్ సర్కార్ మద్యం షాపులను తెరిచిన రెండవ రోజే 75 శాతం రేట్లను పెంచినప్పటికీ.... ఆ క్యూ లైన్లలో మాత్రం మనుషులు తగ్గడం లేదు. మద్యం రేట్లను పెంచినప్పటికీ... మందుబాబులు అవసరమైతే... కొంచం తక్కువ తాగుతాము కానీ... మందు మాత్రం బంద్ చేసేదిలేదు అన్నట్టుగా ఒక ఉద్యమం లాగ ఆ వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. 

ఇకపోతే.... ఇలా మద్యం కోసం క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల తాము ఇన్ని రోజులుగా కరోనా వైరస్ పై పోరులో తీసుకున్న చర్యలు, తమ పోరాటం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నానికి ఒక లేఖ రాసారు. 

పోలీసులు, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లుగా తాము ఇన్ని రోజుల పాటు దాదాపుగా 1,25,000 పైచిలుకు టెస్టులు నిర్వహించి రాష్ట్రంలో ఈ కరోనా పై పోరును సలుపుతుంటే... మద్యం షాపుల వద్ద వందల నుంచి వేల మంది భౌతిక దూరాన్ని పాటించకుండా, మరికొన్ని చోట్ల అయితే ఘర్షణలకు కూడా దిగుతున్నారు. 

ఇలాంటి సంఘటనలు తాము ఇన్ని రోజులుగా ఈ కరోనా పై పోరులో సాధించిన ప్రగతికి ప్రతిబంధకాలుగా మారి సీన్ రివర్స్ అయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు అని అన్నారు. 

కావునా మద్యం అమ్మకాలను దయచేసి ఆపేయండి, లేదా ఆ షాపుల వద్ద కఠినంగా భౌతిక దూరం నియమాలను పాటించేలా తగు చర్యలను తీసుకోండి అంటూ వారు కోరుతున్నారు. 

click me!