
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ భవిష్యత్ ప్రణాళికలను సూత్రప్రాయంగా వెల్లడించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన 8వ ఆవిర్భావ సభలో చేసిన విజ్ఞప్తికీ సమాధానాన్నీ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తున్నదని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని వైసీపీపై ఫైర్ అయ్యారు. అంతేకాదు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే బీజేపీ, జనసేన కూటమి ఏకైక ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అదే సందర్భంలో ఇతర విషయాలు చెబుతూ.. సర్పంచులకు నిధులుకు కేంద్రం నుంచే వస్తున్నవని, వాటినే ఇస్తున్నారని తెలిపారు. అంతేకాదు, రేషన్ షాపులో ప్రజలకు ఇచ్చే రూ. 1 కిలో బియ్యం ఖర్చునూ కేంద్రమే భరిస్తున్నదని పేర్కొన్నారు.
రాజధానిని వైసీపీ నిర్మించలేక చతికిలపడుతున్నదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. అందుకే అమరావతిని చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, బీజేపీది ఒకే మంత్రం అని, అది అభివృద్ధి మంత్రం అని వివరించారు. ఇటీవలే జరిగిన ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ సాధించడానికి కారణం ఇదే తంత్రం అని తెలిపారు.
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని జనసేన 8వ ఆవిర్భవ సభలో తెలిపారు. కాబట్టి, తాము అన్ని శక్తులు కలిసి వెళ్తాయని చెప్పారు. అయితే, భవిష్యత్ పోరాటానికి సంబంధించి బీజేపీ తమకు రోడ్ మ్యాప్ అందించాలని కోరారు. బీజేపీ రోడ్ మ్యాప్ అందిస్తే.. అమలు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో ఆయన బీజేపీతోపాటు టీడీపీనీ కలుపుకోవాలనే ఉద్దేశ్యం ధ్వనించింది.
టీడీపీతో జత కట్టాలని జనసేన యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ, బీజేపీ మాత్రం అందుకు సుముఖంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీతో దోస్తీ కట్టేది లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే జనసేన ప్రతిపాదనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా, సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఒక విషయం స్పష్టం అవుతున్నది. జనసేన, బీజేపీ పొత్తు మాత్రమే ప్రత్యామ్నాయం అని ఆయన పేర్కొన్నారు. అదే ఏకైక ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. అందులో టీడీపీ ప్రస్తావన తేలేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలక వంటి అంశాలను పేర్కొనలేదు. అంటే.. జనసేనతో మాత్రమే బీజేపీ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నదని, టీడీపీ పొత్తును కోరుకోవడం లేదని తెలుస్తున్నది. ఈ వ్యాఖ్యలపై ఇంకా జనసేన నుంచి స్పందన రాలేదు.