
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే.. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కన్వీనర్లను బీజేపీ ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ నియామకాలకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గానూ.. 132 స్థానాలకు కన్వీనర్‌లను బీజేపీ నియమించింది. అందులో కొన్నినియోజకవర్గాలకు కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించడం గమనార్హం. మొత్తం 162 మందిని కన్వీనర్లు, కో కన్వీనర్లుగా నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ పేర్కొంది.
అయితే ప్రస్తుతం కన్వీనర్లుగా నియమించినవారినే.. రానున్న ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పార్టీ బలోపతంలో భాగంగానే ఈ నియామకాలు చేపట్టినట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే బీజేపీ ఏకంగా 132 నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించడం చూస్తుంటే.. ఆ పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా? అనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించడం.. ఒంటరిగానైనా దిగేందుకు సిద్దంగా ఉన్నామని బీజేపీ సంకేతాలు పంపినట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.