
తిరుపతి: వైసిపి ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా పరిశ్రమ అన్నట్లుగా వుంది ఏపీలో పరిస్థితి. జగన్ సర్కార్ సినీ పరిశ్రమపై వివక్ష చూపిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మూవీ టికెట్ రేట్లు తగ్గించి అటు సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు థియేటర్లు మూతపడేలా చేసారంటూ సినిమావాళ్లు సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ (bheemla nayak) సినిమా విడుదల కావడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్, ఎక్స్ ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించలేదు... అంతేకాదు టికెట్ రేట్లను కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్, ఎక్స్ ట్రా షోలకు అనుమతిచ్చింది. దీంతో రెండు ప్రభుత్వాలు ఈ సినిమా విషయంలో వ్యవహరించిన తీరును పోలుస్తూ జగన్ సర్కార్ పై పవన్ అభిమానులతో పాటే కొందరు రాజకీయ నాయకులు సైతం విరుచుకుపడుతున్నారు. ఇలా విమర్శలు చేస్తున్నవారికి సినీ నటి, వైసిపి (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja) కౌంటరిచ్చారు.
ఆదివారం తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడుతూ భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధరల వివాదాన్ని పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయం చేయాలని చూస్తున్నారని రోజా ఆరోపించారు. జనసేన పార్టీ (janasena party)ని కాపాడుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. టిడిపి (TDP) చీఫ్ చంద్రబాబు (chandrababu naidu) డైరెక్షన్ లోనే ప్రస్తుతం పవన్ నటిస్తున్నారని రోజా సెటైర్లు వేసారు.
పవన్ కల్యాణ్ పై కక్షతో భీమ్లా నాయక్ సినిమాను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని...అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. రాజకీయ ఎజెండాతోనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. నిజానికి పవన్ అభిమానులకు జగన్ ప్రభుత్వం మేలు చేసిందని రోజా పేర్కొన్నారు.
భీమ్లా నాయక్ సినిమా టికెట్ రేటు తెలంగాణలో రూ.350 వుంటే ఏపీలో మాత్రం కేవలం రూ.150 మాత్రమే వుంది. ఇలా అభిమానులకు అందుబాటులో వుండేలా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి పవన్ అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలన్నారు రోజా.
''భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పవన్ ను ఆర్థికంగా దెబ్బతీసేలా వుందని అంటున్నారు. ఈ సినిమాకు పవన్ నిర్మాతో, డిస్ట్రిబ్యూటరో కాదు... అలాంటిది ఆయనెలా ఆర్ధికంగా నష్టపోతాడో నాకయితే అర్ధం కావడంలేదు. అయినా బాలకృష్ణ అఖండ, అల్లుఅర్జున్ పుష్ప సినిమాలకు వున్న టికెట్ ధరలే భీమ్లా నాయక్ కు వున్నారు. దీన్ని బట్టే వైసిపి ప్రభుత్వం ఏ ఒక్కరినో టార్గెట్ చేసి నిర్ణయాలు తీసుకోదని అర్థమవుతుంది'' అని రోజాపేర్కొన్నారు.
ఇదిలావుంటే చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు తెలంగాణలో బీమ్లా నాయక్ చిత్రానికి బెనిఫిట్ షోలకు, రోజుకు ఐదు షోలకు అనుమతి లభించింది. ఇటీవల జరిగిన బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు, భారత చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరాన్ని ఒక సుస్థిరమైన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యం అని చెప్పారు.
మరోవైపు ఏపీలో మాత్రం బీమ్లా నాయక్ చిత్రంపై ఆంక్షలు కొనసాగాయి. ఏపీలోని పలు సినిమా థియేటర్లకు జగన్ సర్కారు ముందస్తు నోటీసులు జారీ చేసింది. బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై పవన్ అభిమానులు మండిపడ్డారు. పలుచోట్ల రోడ్లపైకి చేరి తమ నిరసనను కూడా వ్యక్తం చేసారు.
ఈ క్రమంలోనే విజయవాడలో ఏర్పాటైన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకరిస్తుంది. బీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో.. పవన్‌కు ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు వంగవీటి మోహనరంగా ఫొటోలను ఉంచారు. అంతేకాకుండా పై భాగంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చిత్రాలను ఉంచారు. ఇంకా ఆ ఫ్లెక్సీలో హ్యాట్సాఫ్ సీఎం సర్ అని కూడా రాసి ఉంచారు. ఈ ప్లెక్సీ సినీ వర్గాల్లోనే కాదు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.