జర్మనీలో దారుణం... ప్రవాసాంధ్రుల ఇంట అగ్నిప్రమాదం, బాపట్ల జంట పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Sep 20, 2021, 2:36 PM IST
Highlights

జర్మనీలో నివసిస్తున్న గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తాళ్లూరి భాస్కర్-పుష్ఫ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు జర్మనీ నుండి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. 

బాపట్ల: జర్మనీలోని హాంబర్గ్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ప్రవాసాంధ్ర జంట తీవ్రంగా గాయపడ్డారు. ఉపాధి నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ నుండి జర్మనీకి వెళ్ళిన తాళ్లూరి భాస్కర్‌-పుష్ప దంపతులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. కాలిన గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

హాంబర్గ్ లో భాస్కర్‌ దంపతులు నివాసముంటున్న ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో భార్యభర్తలిద్దరూ ఈ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

అగ్నిప్రమాదంలో భాస్కర్ దంపతులు గాయపడిన విషయాన్ని బాపట్ల పోలీసులకు ఫోన్ చేసి తెలిపారు జర్మనీలోని అతడి స్నేహితులు. దీంతో పోలీసులు వెంటనే భాస్కర్ తండ్రి శివయ్యకు విషయాన్ని తెలిపారు. ఈ విషయం తెలిసి ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.  

మంచి జీవితాన్ని కోరుకుని దేశంకాని దేశానికి వెళ్లిన తమ కొడుకు-కోడలు ఇలా చావుబ్రతుకుల్లో వుండటంతో భాస్కర్ తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు దయుంచి తమ కొడుకు,కోడలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు. భాస్కర్-పుష్ఫ దంపతులు త్వరగా కోలుకోవాలని బాపట్లలోని వారి కుటుంబసభ్యులు, బంధువులు కోరుకుంటున్నారు.
 

click me!