సారీ మమ్మీ.. అని లేఖరాసి బ్యాంక్ ఉద్యోగి సూసైడ్

By ramya neerukondaFirst Published Oct 2, 2018, 3:39 PM IST
Highlights

సోమవారం ఉదయం సందీప్‌కుమార్‌రెడ్డి బ్యాంక్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి, తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ, డ్యూటీకి రాలేనంటూ ఫోన్‌ చేసి చెప్పాడు.

సారీ మమ్మీ అని సూసైడ్ నోట్ రాసి.. ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కడపజిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లా ఉలవలపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన వింత వెంకటేశ్వరరెడ్డి, జయమ్మలకు ఒక కుమార్తె, ఒక కుమారుడు సందీప్ కుమార్‌రెడ్డి. కాగా వెంకటేశ్వరరెడ్డి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. తల్లి జయమ్మ భూములు, తోటలు చూసుకుంటూ స్వగ్రామంలోనే ఉంటోంది. సందీప్ కుమార్‌రెడ్డికి కార్పొరేషన్‌ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. గోవాలో మూడేళ్లు పని చేశాడు. మూడు నెలల క్రితమే అక్కడి నుంచి బదిలీపై ప్రొద్దుటూరు వచ్చాడు. ఇక్కడ కార్పొరేషన్‌ బ్యాంక్‌‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లక్ష్మీటవర్స్‌లో ప్లాట్‌ అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నాడు.
 
ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం సందీప్‌కుమార్‌రెడ్డి బ్యాంక్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి, తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ, డ్యూటీకి రాలేనంటూ ఫోన్‌ చేసి చెప్పాడు. అయితే ఉదయం 11 గంటల సమయంలో బ్యాంక్‌ మేనేజర్‌.. సందీప్‌కు ఎలాగుందో చూసి రమ్మంటూ తన సిబ్బందిని సందీప్‌ నివాసముండే అపార్టుమెంట్‌కు పంపాడు. అతను ప్లాట్‌కు వచ్చి, తలుపు కొట్టినా, సందీప్‌కుమార్‌రెడ్డి పలకలేదు. దీంతో కిటికిలోంచి చూడగా, ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేయగా, వారు పోలీసులకు, తల్లి జయమ్మకు సమాచారం ఇచ్చారు. 

జయమ్మ ప్రొద్దుటూరుకు వచ్చారు. సంఘటనా స్థలాన్ని సీఐ జయనాయక్‌, ఎస్‌ఐలు కృష్ణంరాజునాయక్‌, నరసయ్య తమ సిబ్బందితో చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్లాట్‌లో సారీ మమ్మీ అంటూ ఆ వాక్యంతో పాటు సెల్‌ఫోన్‌ నెంబరు రాసి ఉండగా, ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జయనాయక్‌ తెలిపారు.

click me!