ఆ ఆలోచన సీఎం జగన్‌కు లేదు.. సినీ ఇండస్ట్రీ సమస్యల మీదనే చిరంజీవి జగన్‌ను కలిశారు.. మంత్రి బాలినేని

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 2:28 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మధ్య ఇటీవల జరిగిన భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని రాజకీయం చేయడంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మధ్య ఇటీవల జరిగిన భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని రాజకీయం చేయడంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీ సమస్యల మీదనే సినీ నటుడు చిరంజీవి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారని చెప్పారు. ఆ విషయాన్ని కొందరు రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని.. అలా ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావడం లేదన్నారు. 

సీఎం జగన్‌కు అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేసే అటువంటి ఆలోచన లేదన్నారు. అలాంటివి చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అలవాటని ఆరోపించారు. జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు దళితుల్లో చిచ్చుపెట్టడానికి, కాపుల్లో చిచ్చుపెట్టడానికి, రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ సినిమా వాళ్ల కోసం చేయగలిగినంత చేస్తారని చెప్పారు. 

ఇదిలా ఉంటే గురువారం.. తాడేపల్లిలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం జగన్ పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. ఆ తర్వాత కొద్ది గంటలకే.. చిరంజీవికి సీఎం జగన్‌ రాజ్యసభ ఆఫర్ చేశారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన చిరంజీవి..తనకు రాజ్యసభ సీటు అనే మాట స్పెక్యులేషన్ మాత్రమేనని చెప్పారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. 

‘తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దని కోరారు. ఈ వార్తలకి పుల్ స్టాప్ పెట్టమని కోరుతన్నట్టుగా చెప్పారు.
 

click me!