బాలయ్య కొత్త నియోజకవర్గం చూసుకున్నారా?

First Published Feb 5, 2017, 2:17 AM IST
Highlights

బాలయ్య పెనమలూరు నుండి పోటీ చేయటం ఖాయమైతే నందమూరి కుటుంబానికి హిందుపురం నియోజకవర్గంతో ఉన్న అనుబంధం దాదాపు తెగిపోయినట్లే.

               

 

 

 

రానున్న ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుండి ప్రస్తుతం టిడిపి తరపున బోడె ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ప్రసాద్ పై విపరీతమైన ఆరోపణలున్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ లాంటి ఎన్నో వ్యవహారాల్లో ప్రసాద్ పేరు ప్రచారంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రసాద్ కు టిక్కెట్టు వచ్చే అవకాశాలు లేవు. అందుకని ఇక్కడి నుండి పార్టీ ఎవరో ఒకరిని కొత్తగా పోటీ చేయించాల్సిందే. కాబట్టే పెనమలూరులో పోటీ చేసే విషయమై బాలకృష్ణ ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం.

 

అదే సమయంలో మొత్తం రాయలసీమలోనే టిడిపి పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లాగే అనంతపురం జిల్లాలో  కూడా కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయి. అందులో భాగంగానే హిందుపురంలోనూ పరిస్ధితులు విషమించాయి. దానికితోడు బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉండటంతో అసలు నియోజకవర్గాన్నే పట్టించుకోవటం లేదు. అందుకనే నియోజకవర్గాన్ని పిఏ శేఖర్ కు అప్పచెప్పారు. అప్పటి నుండి  పిఏ ఆడిందే ఆటగా సాగుతోంది. పిఏ వ్యవహారశైలి శృతిమించిపోతోందని నేతలు ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేరు. జరుగుతున్న విషయాలు తెలిసినా జిల్లా అధ్యక్షుడు మొదలు చంద్రబాబు, లోకేష్ కూడా పట్టించుకోవటం లేదు.

 

కేవలం పిఏ కారణంగానే బాలకృష్ణకు, పార్టీ నేతలకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. దశాబ్దాల పాటు పార్టీకి సేవలందిస్తున్న పలువురు నేతలపైన కూడా పిఏ పోలీసు కేసులు పెట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాంతో నేతల్లో అత్యధికులు బాలకృష్ణకు వ్యతిరేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడి నుండి పోటీ చేస్తే అభాసుపాలయ్యే బదులు కృష్ణాజిల్లాకు మారిపోతే బాగుంటుందని బాలకృష్ణ అనుకున్నట్లు సమాచారం. అదీకాకుండా రాజధాని ప్రాంతమైన తర్వాత విజయవాడలోని నియోజకవర్గాలతో పాటు సిటీకి అనుకుని ఉండే నియోజకవర్గాలకు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. బాలకృష్ణది ఎటుతిరిగీ కృష్ణా జిల్లానే కాబట్టి సొంత జిల్లాలో పోటీ చేస్తే అన్నీ విధాలుగా కలిసి వస్తుందని అనుకుంటున్నారు.

 

హిందుపురం నుండి మొదట్లో ఎన్టీఆర్ పోటీ చేసారు. తర్వాత కుమారుడు హరికృష్ణ, ఇపుడు బాలకృష్ణలు పోటీ చేసారు. అందరూ విజయం సాధించినవాళ్ళే. అయితే, కుటుంబాన్ని నియోజకవర్గం ఎంత ఆధరించినా పెద్దగా అభివృద్ధి జరిగిందిమాత్రం ఏమీ లేదు. కేవలం ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే ప్రజలైనా, నేతలైనా కుటుంబ సభ్యులను గెలిపిస్తున్నారు. ఒకవేళ బాలయ్య పెనమలూరు నుండి పోటీ చేయటం ఖాయమైతే నందమూరి కుటుంబానికి హిందుపురం నియోజకవర్గంతో ఉన్న అనుబంధం దాదాపు తెగిపోయినట్లే.

click me!